తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఊ అంటే బీజేపీ సర్కారుపై ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎలాగో రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకి లేదని భావిస్తున్న ఆయన కావాలనే ఆ పార్టీని రెచ్చగొడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అందుకే గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడు బీజేపీపై కేసీఆర్ మాటలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ విజయంతో కేసీఆర్ ప్రస్టేషన్ పీక్‌కు చేరిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ కేంద్రం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ జ్వరం మరో జగడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. ఇక్రిసాట్ స్వర్ణోత్సవ సంబరాలు, రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వచ్చారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం సీఎం కేసీఆర్ మోడీకి స్వాగతం పలికి కార్యక్రమాలు పూర్తయేంతవరకూ ఆయనతోనే ఉండి తిరిగి పంపిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కానీ తీరా మోడీ వచ్చే ముందు కేసీఆర్ జ్వరంతో ప్రధాని కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారనే వార్తలు వచ్చాయి. అందుకు తగినట్లు గానే మోడీకి స్వాగతం పలికేందుకు.. ఆ తర్వాత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు.. వీడ్కోలు చెప్పేందుకు కేసీఆర్ వెళ్లలేదు. దానికి జ్వరం అనే వంక పెట్టుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కేసీఆర్ వ్యవహారశైలిపై రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని కార్యక్రమానికి కేసీఆర్ కావాలనే హాజరు కాలేదని ఇది మోడీని అవమానించడమేనని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడుతున్నారు. మోడీ అంటే కేసీఆర్‌కు భయమని.. అందుకే ఆయన వస్తే కేసీఆర్ జ్వరంతో ఇంట్లో పడుకున్నారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కనిపిస్తున్నాయి.
మరోవైపు బీజేపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ రంగంలోకి దిగింది. ప్రధాని ప్రైవేటు కార్యక్రమాలకు సీఎం వెళ్లి స్వాగతం చెప్పాల్సిన అవసరం లేదని ఆ పార్టీ పేర్కొంది. సీఎం కేసీఆర్ అనారోగ్యంతో ఉంటే దాన్ని కూడా బీజేపీ రాజకీయం చేస్తుందని మండిపడింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్న కేసీఆర్.. కావాలనే మోడీ పర్యటనకు డుమ్మా కొట్టారని మరో వర్గం వాదిస్తోంది. ఏదేమైనా కేసీఆర్ తీరు ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.