ఇపుడిదే హాట్ టాపిక్ అయిపోయింది. నగిరి నియోజకవర్గంలో తన ప్రత్యర్ధులతో ఎంఎల్ఏ రోజాకు పడటం లేదన్నది వాస్తవం. ఈ విషయం ఇపుడు కొత్తేమీకాదు చాలా కాలంగా ఈ సమస్య ఉన్నదే. అలాంటిది శ్రీశైలం ట్రస్టుబోర్డు ఛైర్మన్ గా రెడ్డివారి చక్రపాణిరెడ్డికి ప్రభుత్వం రెండోసారి అవకాశమిచ్చింది. దాంతో తన ప్రత్యర్ధి చక్రపాటిరెడ్డిని ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని రోజా ఆగ్రహంగా ఉన్నమాట వాస్తవమే.
ఈ నేపధ్యంలోనే చక్రపాణిరెడ్డి నియామకానికి నిరసనగా ఎంఎల్ఏగా రాజీనామా చేస్తానని రోజా అన్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతోంది. నిజానికి ఎంఎల్ఏగా రాజీనామా చేస్తానని రోజా ఎక్కడా ప్రకటించలేదు. మరి రోజా రాజీనామా చేయబోతున్నట్లు ఎలా సోషల్ మీడియాలో వైలర్ అవుతోందో అర్ధం కావటంలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే జగన్మోహన్ రెడ్డికి రోజా ఎంత దగ్గరో చక్రపాణిరెడ్డి కూడా అంతే దగ్గర. పైగా చక్రపాణిరెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ విషయం రోజాకు తెలీందేమీకాదు. అప్పట్లో నాన్ లోకల్ అయిన రోజాకు టికెట్ ఇవ్వద్దని ఎంతమంది చెప్పినా జగన్ వినకుండా టికెట్ ఇచ్చారు. అలాగే ఇపుడు చక్రపాణిరెడ్డికి ఛైర్మన్ పదవి ఇవ్వద్దని రోజా చెప్పినా జగన్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో రోజా మూడోసారి గెలవాలంటే చక్రపాణిరెడ్డితో పాటు ఎంఎల్ఏ ప్రత్యర్ధులంతా పనిచేస్తేనే ఆమె గెలుస్తుంది. ఈ విషయం తెలుసుకాబట్టే సొంతంగా జనాల్లోకి రోజా వెళిపోతున్నారు. రోజా గెలుపుకు వీళ్ళు పనిచేయకపోయినా పర్వాలేదు కానీ వ్యతిరేకం చేస్తే మాత్రం కష్టమే.
నియోజకవర్గంలో పరిస్ధితి ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఎంఎల్ఏ పదవికి రోజా ఎందుకు రాజీనామా చేస్తారు ? బెదిరింపులకు జగన్ లొంగిపోయేరకం కాదని అందరికి బాగా తెలుసు. కాబట్టి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి తాను సాధించగలిగేదేమీ లేదని రోజాకూ తెలుసు. చక్రపాణిరెడ్డి నియామకంపై రోజా అలిగినట్లు, రాజీనామా చేస్తానని బెదిరించినట్లు ఎలా ప్రచారం అవుతోందో అర్ధం కావటంలేదు. మొత్తానికి ఏదో రూపంలో ఫైర్ బ్రాండ్ రోజా మాత్రం ప్రచారంలోనే ఉంటున్నారు.