సాధారణంగా.. భార్యా భర్త విడిపోవడానికి.. విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి. ఇద్దరి మధ్యమనస్పర్థలు రావడం.. లేకపోతే.. గతంలో పరిచయాలు పునరావృతం కావడం.. ఆర్థిక సమస్యలు, పిల్లలు పుట్టకపోవడం.. ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లడం.. లేదా.. కుటుంబంలో కలహాలు. ఇవే మెజారిటీగా విడాకులు తీసుకుంటున్నవారిలో కనిపించే కారణాలు. అయితే.. ఇప్పుడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ విడాకులకు సంబంధించి సరికొత్త కామెంట్ చేశారు.
పైన పేర్కొన్న అన్ని కారణాలకంటే కూడా తను పరిశీలించిన కారణమే కీలకంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్య వల్లే ముంబయిలో విడాకులు పెరిగిపోతున్నాయని అమృత అన్నారు. మహా వికాస్ అఘాడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ముంబయిలో భార్యాభర్తల విడాకులకు సరికొత్త కారణం అని అమృత ఫడణవీస్ చెప్పారు. ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు తమ కుటుంబ సభ్యులకు తగినంత సమయం కేటాయించలేకపో తున్నారని అన్నారు. ఆ పరిస్థితులు విడాకులకు దారితీస్తున్నట్లు ఆమె చెప్పారు. ముంబయిలో విడాకులు తీసుకుంటున్నవారిలో 3శాతం మంది ట్రాఫిక్ సమస్య బాధితులేనని అమృత ఫడణవీస్ తెలిపారు.
మహా వికాస్ అఘాడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి వారి సమస్యలను మాత్రం గాలికి వదిలేస్తుందని విమర్శించారు. ఈ రకమైన వాదనను వినడం ఇదే తొలిసారని ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ విమర్శించారు. ట్రాఫిక్ సమస్యల కారణంగానే విడాకులు తీసుకుంటున్నారనే వాదన విస్మయం కలిగిస్తోందని అన్నారు. విడాకులకు చాలా కారణాలుండవచ్చని చెప్పారు. అయితే.. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అమృత ఫడణవీస్ ఈ వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates