అండ‌మాన్‌లో టీడీపీ పోటీ

దాదాపు నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ ప్ర‌స్థానం.. తెలుగు గ‌డ్డ‌పై అధికారం చ‌లాయించిన తెలుగు దేశం పార్టీ ప్ర‌స్తుత ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఇటు తెలంగాణ‌లో ఆ పార్టీకి మ‌నుగ‌డ లేకుండా పోయింది. ఇక ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేతిలో ఘోర ప‌రాజ‌యంతో అక్క‌డా పార్టీ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి పార్టీ ఉనికిని కాపాడుకోవాల‌ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తెగ ఆరాట‌ప‌డుతున్నారు.

మ‌రోవైపు ఏపీలో ప‌రిస్థితులు చ‌క్క‌బెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తూనే.. టీడీపీకి జాతీయ పార్టీ అనే పేరు కొన‌సాగేలా చూస్తున్నార‌ని తెలిసింది.  అందుకే ఏకంగా అండ‌మాన్ నికోబార్‌లో పోటీకి టీడీపీ సిద్ధ‌మైంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అండ‌మాన్ నికోబార్‌లో మున్సిపాటిలీ, పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ బ‌రిలో దిగుతుండ‌డం విశేషం. అది కూడా కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్ట‌డం మ‌రీ విశేషం.

2018లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్టిన టీడీపీ ఆ బంధాన్ని ఇంకా కొన‌సాగిస్తుంద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంత‌మైన అండ‌మాన్ నికోబార్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయాల‌ని కాంగ్రెస్‌, టీడీపీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా ఈ రెండు పార్టీలు ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చాయి. ఎవ‌రెవ‌రు ఎక్క‌డెక్క‌డ పోటీ చేయాల‌నే విష‌యంపై రెండు పార్టీల నాయ‌కులు ఓ నిర్ణయానికి వ‌చ్చారు.

పోర్టుబ్లెయిర్ మున్సిపాలిటీలో 2,5,16 వార్డుల్లో టీడీపీ పోటీ చేయ‌నుంది. మిగిలిన చోట్ల కాంగ్రెస్ బ‌రిలో దిగుతుంది. మ‌రి ఈ ఎన్నికల్లో టీడీపీకి ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో చూడాలి. ఎప్ప‌టి నుంచో ప‌ట్టున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే పార్టీకి ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన ఒక్క ఎన్నిక‌ల్లోనూ టీడీపీకి ఆశించిన ఫ‌లితాలు రాలేదు. ఘోర‌మైన ప‌రాజ‌యాలు త‌ప్ప‌లేదు. పైగా బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనూ వైసీపీ జెండా ఎగురుతోంది. ఈ నేప‌థ్యంలో అండ‌మాన్‌లో టీడీపీకి ప్ర‌జ‌లు ఓట్లు వేస్తారా? అని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.