బండి సంజ‌య్ తో రేవంత్ భేటీ

Revanth Reddy

తెలంగాణ రాజ‌కీయాల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ది ప్ర‌ధాన పాత్ర అయితే మిగ‌తా కీల‌క పాత్ర‌లో ఉండేది బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు , ఎంపీ బండి సంజ‌య్ , మ‌రొక‌రు తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడైన ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ ఇద్ద‌రు ఎంపీలు కం జాతీయ‌ పార్టీల రాష్ట్ర అధ్య‌క్షులు అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా తెలంగాణ సీఎం పై విరుచుకుప‌డుతుంటారు.

జాతీయ పార్టీ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ప్ప‌టికీ తెలంగాణ స‌మ‌స్య‌ల‌ను త‌మదైన శైలిలో వివ‌రిస్తుంటారు. ఇలాగే తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాల‌ని చేసిన డ‌మాండ్‌పై ఈ ఇద్ద‌రు నేత‌లు విరుచుకుప‌డ్డారు. అయితే, అంత‌లోనే ఇద్ద‌రు స‌మావేశం అవ‌డం, అందులోనూ ఢిల్లీ కేంద్రంగా ఈ స‌మావేశం అవుతుండ‌టం సంచ‌ల‌నంగా మారింది.

కేసీఆర్ వ్యాఖ్య‌లకు నిర‌స‌న‌గా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేడు జై భీమ్ దీక్ష కార్యక్రమాలను నిర్వహించారు. మండల కేంద్రాలలో, అదేవిధంగా జిల్లా కేంద్రాలలో, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో, ఢిల్లీలో ఈ దీక్ష‌లు చేప‌ట్టారు. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మ‌రియు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు తదితరులు పాల్గొన్నారు. అనంత‌రం బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తీరును త‌ప్పుప‌ట్టారు. రాజ్యాంగాన్ని మార్చాల‌న్న కేసీఆర్ డిమాండ్ స‌రికాద‌ని అన్నారు. అయితే, చిత్రంగా ఈ నిర‌స‌న త‌ర్వాత రేవంత్ రెడ్డి , బండి సంజ‌య్ స‌మావేశ‌మ‌య్యారు.

ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్లో ఎంపీ బండి సంజ‌య్ దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్ష అనంత‌రం అక్క‌డే ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వారితో స‌మావేశ‌మ‌య్యారు. స‌ర‌దాగా టీ తాగుతూ ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డున్న మీడియా మిత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు స‌ర్ అంటే… ఇంకేం ఉంటుంది?  తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌లు … రాజ‌కీయ ప‌రిస్థితుల గురించే అంటూ ఇద్ద‌రు ఎంపీలు చ‌మ‌త్క‌రించారు.