కల్తీ మందు తాగి ఇష్టానుసారం వాగాడు: కేసీఆర్ పై రేవంత్ ఫైర్

కేంద్ర బ‌డ్జెట్ అనంత‌రం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పందిస్తూ అనేక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. కేంద్రం నిర్ణ‌యంపై త‌న‌దైన శైలిలో స్పందించ‌డ‌మే కాకుండా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై సైతం ఆయ‌న విరుచుకుప‌డ్డారు. స‌హ‌జంగానే కేసీఆర్ కామెంట్ల‌పై వివిధ ప‌క్షాలు స్పందించాయి, స్పందిస్తున్నాయి. అయితే, టీపీసీసీ అధ్యక్షుడు, ఎం.పీ రేవంత్ రెడ్డి మాత్రం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మోడీ బడ్జెట్ తో దేశానికి మేలు జరగదు అన్న‌ది నిజ‌మే అయిన‌ప్ప‌టికీ, దీనిపై స్పందిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వ‌హించిన‌ ప్రెస్ మీట్లో మాత్రం మర్యాద లేదని త‌ప్పుప‌ట్టారు. అంతేకాకుండా కేసీఆర్ కామెంట్ల‌పై రేవంత్ ఫీల‌య్యారు కూడా!

కేంద్ర బడ్జెట్ గంటన్నర ఉంటే కేసీఆర్ రెండున్నర గంటలు ఏకపాత్రాభినయం చేశార‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కల్తీ మందు తాగి వచ్చినట్లు మాట్లాడారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోడీ , ఆర్థిక‌మంత్రి నిర్మలా సీతారామన్ గురించి నీచంగా,జుగుప్సాకరంగా కేసీఆర్ మాట్లాడారని మండిప‌డ్డారు. విలేక‌రుల స‌మావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసభ్యకరమైన భాష మాట్లాడారని రేవంత్ రెడ్డి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ భాషను ఖండిస్తున్నామ‌ని తెలిపారు. సిద్ధాంతపరంగా బీజేపీని వ్యతిరేకిస్తామ‌ని స్ప‌ష్టం చేసిన రేవంత్ రెడ్డి  కేసీఆర్ భాషను వ్యతిరేకిస్తున్నామ‌ని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడితే తెలంగాణ పరువు ఏం కావాలని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. మహిళలను గౌరవించే సంస్కృతి భారత సంస్కృతి అని స్ప‌ష్టం చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ భాషను సభ్య సమాజం క్షమించదని తేల్చిచెప్పారు. కేసీఆర్ భాష ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మాట్లాడిన కేసీఆర్ తీరు బీజేపీ విధానం ప్ర‌కార‌మే ఉంద‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భూస్వాములు,అగ్ర వర్ణాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ మాటలను కేసీఆర్ మాట్లాడినట్లు ఉంది అని ఆరోపించారు. రాజ్యాంగం మార్చలన్నది బీజేపీ కుట్ర అని పేర్కొన్న రేవంత్ రెడ్డి బీజేపీ కుట్రల‌కు కేసీఆర్ వంత పాడారని మండిప‌డ్డారు. కేసీఆర్ ను ముందుంచి రాజ్యాంగం రద్దు అంశాన్ని తెరమీదికి తెచ్చారని రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ రాజ్యాంగం రద్దు కుట్రకు కేసీఆర్ మద్దతు తెలిపినందున అన్ని జిల్లా,మండల కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్దం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకునేందుకు రెండు రోజుల పాటు గాంధీ భవన్ లో నిరసన దీక్షలు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.