కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై స్పందించేందుకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా ? వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నిజానికి కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా పేలవంగా ఉంది. రైతాంగానికి కానీ లేదా పేదలకు లేదా మధ్య తరగతికి ఊరటినిచ్చేలా చెప్పుకోతగ్గవేమీ లేవు. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీయార్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
బడ్జెట్ తీరుతెన్నుల గురించి కేసీయార్ మీడియాతో మాట్లాడినపుడు నరేంద్ర మోడీ, నిర్మల సీతారామన్ ను దుమ్ము దులిపేశారు. దాదాపు మూడు గంటలకు పైగా జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ పాయింట్ టు పాయింట్ మాట్లాడి మోడీ, కేంద్రమంత్రిపై విరుచుకుపడ్డారు. కేసీయార్ లాగ జగన్ కూడా మోడి, నిర్మల దుమ్ము దులపాల్సిన అవసరం లేదా విరుచుకు పడాల్సిన అవసరం కూడా లేదు.
కానీ రాష్ట్ర ప్రయోజనాలకు ఈ బడ్జెట్ ఏ విధంగా నష్టమో తెలియజేయాల్సిన అవసరం ఉంది కదా. మీడియా సమావేశం పెట్టి మోడిని నిలదీయాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. ఒకవైపు కేంద్రం కారణంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నా కూడా జగన్ మౌనంగా ఉంటే ఉపయోగం లేకపోగా నష్టమని గ్రహించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి జగన్ మద్దతిస్తునే ఉన్నారు. దానికి ప్రతిఫలంగా కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోలేదు.
రాష్ట్ర ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోని కేంద్రానికి జగన్ మద్దతిచ్చే విషయమై ఆలోచించాల్సిందే. మద్దతు ఇవ్వకపోతే కేంద్రంలోని పెద్దలు ఏం చేస్తారు ? ఏమి చేసినా జగన్ కు జరిగే నష్టమేమీ లేదు. ఇంతోటి దానికి వ్యక్తిగత ప్రయోజనాల కోసమని రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం చాలా తప్పు. కాబట్టి ఇప్పటికైనా బడ్జెట్లో ఏపికి జరుగుతున్న నష్టాన్ని మోడి దృష్టికి జగన్ తీసుకెళ్ళాలి. ఈ విషయంలో జగన్ తమిళనాడు విధానాన్నే ఆదర్శంగా తీసుకోవాలి. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మొక్కుబడిగా స్పందించారు కానీ ఆ డోసు సరిపోదని జగన్ గ్రహించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates