బ‌డ్జెట్‌లో ఏపీకి ఇచ్చిందేంటి?

తాజాగా ప్ర‌వేశ పెట్టిన వార్షిక బ‌డ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు జ‌రిగాయా? కేంద్ర ప్ర‌భుత్వం ఏపీపై వ‌రాల జ‌ల్లు కురిపించిందా? అంటే.. లేద‌నే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఏపీకి సంబంధించి.. కేంద్రం నెర‌వేర్చాల్సిన అనేక అంశాల్లో కీల‌క‌మైన అంశం.. ప్ర‌త్యేక హోదా. 2012లో విభ‌జ‌న నేప‌థ్యంలో ఇచ్చిన ఈ హామీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర‌లేదు. ఈ నేప‌థ్యంలో ఎప్ప‌టిక‌ప్పుడు.. వైసీపీ ప్ర‌భుత్వం ప్లీజ్ .. ప్లీజ్.. అంటూ.. హోదాపై కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తూనే ఉంది. అయితే.. హోదా ముగిసిన అధ్యాయ‌మ‌ని.. ప్యాకేజీకి ఏపీ ఒప్పుందని కేంద్రం చెబుతోంది.

అయితే.. ప్యాకేజీలోని అంశాల‌పైనా కేంద్రం నిర్లిప్తంగా వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. ప్యాకేజీ ప్ర‌కారం చూసుకున్నా.. పోల‌వరం, రాజ‌ధాని నిధులు.. వెనుక‌బ‌డిన జిల్లాల అభివృద్ధి నిధులు ఇవ్వాల్సి ఉంది. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో ప్యాకేజీ నిధుల‌ను కొంత మేరకు ఇచ్చారు. అయితే..తాము అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని.. ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చిన వైసీపీ.. దానిని ఇప్ప‌టి వ‌ర‌కు సాధించ‌లేక పోయారు. ఈ క్ర‌మంలో ఎలానూ హోదా కోసం అడుగుతున్నాం క‌దా.. ప్యాకేజీ విష‌యం ప్ర‌స్తావిస్తే.. హోదా ప‌క్క‌కు జారిపోయే ప్ర‌మాదం ఉంటుంద‌ని .. భావించిన వైసీపీ నేత‌లు.. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టారు.

దీంతో అటు హోదా రాక‌.. ఇటు.. ప్యాకేజీ కూడా లేక‌..ఆర్థికంగా రాష్ట్రం తీవ్రంగా న‌ష్ట‌పోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి పెట్టుబ‌డులు ఆశించిన విధంగా రాలేదు. అంతేకాదు.. అప్పులు చేసుకుని దిన‌దిన గండంగా పాల‌న‌ను ముందుకు తీసుకువెళ్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజా బ‌డ్జెట్‌పై వైసీపీ ప్ర‌భుత్వం ఆశ‌లు పెట్టుకుంది. కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టుకు పెరిగిన అంచ‌నాల మేర‌కు నిధులు కేటాయిస్తారా? అని ఎదురు చూసింది. అదేవిధంగా రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల‌కు కూడా నిధులు ఇస్తార‌ని ఆశించారు..

అయితే.. తాజా బ‌డ్జెట్‌లో మాత్రం.. ఒక్క‌రూపాయి కూడా ఆయా అంశాల‌కు కేటాయించ‌లేదు. అంతేకాదు.. రాష్ట్రాన‌నికి ప్ర‌త్యేకంగా బ‌డ్జెట్‌లో కేటాయింపులు చేయ‌లేదు. బ‌డ్జెట్ అంటే.. ఒకప్పుడు అన్ని రాష్ట్రాల‌ను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు జ‌రిపేవారు. అయితే.. ఇప్పుడు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ మొత్తం మోడీ కేంద్రంగా కేటాయింపులు జ‌రిపారు.. అంతేకాదు. రాష్ట్రాల‌ను అస‌లు ప‌ట్టించుకోలేదు. కేంద్రం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌కే కేటాయింపులు చేశారు. అంతేత‌ప్ప‌.. రాష్ట్రాల‌ను ప‌ట్టించుకోలేదు. ఈ క్ర‌మంలో ఏపీకి తీర‌ని అన్యాయ‌మే జ‌రిగింద‌ని అంటున్నారు.. ఒక్క ఏపీనే కాదు.. ఏ రాష్ట్రానికీ.. ఈ బ‌డ్జెట్ ఏమాత్రం ప్ర‌యోజ‌న‌క‌రంగా లేద‌ని అంటున్నారు.