ఏపీలో కమలం ఎత్తులు.. నో యూజ్?

దేశంలో హిందుత్వ ఫార్ములాతో రాజకీయం చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ఎవరు అవునన్నా… కాద‌న్నా ఇదే నిజం. బీజేపీ పూర్తిగా హిందూ మతం ఆధారం చేసుకునే రాజకీయం చేస్తుంది. ఈ ఫార్ములాతోనే ఇప్పటివరకు సక్సెస్ అవుతూ వస్తుంది. ఇక ఇదే ఫార్ములాతో బలం లేని రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలని చెప్పి బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో తమ పని మొదలుపెట్టేశారు. అయితే ఇప్పటివరకు ఏపీలో కాస్త వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్ళిన బీజేపీ..ఇప్పుడు వెర్షన్ మార్చింది. అమిత్ షా రాష్ట్రానికి వచ్చి బీజేపీ నేతలకు క్లాస్ తీసుకున్నాక మార్పు వచ్చింది.

ఇంతవరకు జగన్‌పై పెద్దగా విమర్శలు చేయని అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతూ హడావిడి చేసేస్తున్నారు. తాజాగా గుడివాడలో క్యాసినో అంశంపై టీడీపీ పోరాటం చేస్తుంది. కానీ అక్కడకు వీర్రాజు వెళ్ళి కాస్త హడావిడి చేశారు. ఇక సమస్యలు ఏమి లేకపోతే కొత్త సమస్యలు సృష్టించి మరీ పోరాటాలు మొదలుపెట్టారు బీజేపీ నేతలు. అసలు గుంటూరులో ఉన్న క్లాక్ టవర్‌కు జిన్నా అనే పేరు దశాబ్దాల కాలం నుంచి ఉంది. దీని గురించి ఎవరు ఎప్పుడు ఎత్తలేదు.

కానీ ఇప్పుడు బీజేపీ ఆ విషయంపై హడావిడి చేస్తుంది. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జిన్నా పేరుని వెంటనే తొలగించి క్లాక్ టవర్‌కు మన భారతీయుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తాజాగా హిందూ ఐక్యపోరాట వేదిక పేరుతో జిన్నా టవర్‌పై గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారు. అసలు ఇంతకాలం లేని సమస్యని సృష్టించి, దానిపై బీజేపీ బాగా హడావిడి చేసేస్తుంది. అయితే బీజేపీ హడావిడిని రాష్ట్ర ప్రజలు పట్టించుకునే అవకాశాలు లేవు.

బీజేపీ హ‌డావిడి అంతా రాజ‌కీయ ప్ర‌యోజ‌న కోణంలోనే క‌నిపిస్తోంది త‌ప్పా… రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఆ పార్టీకి ఏ మాత్రం ప‌ట్ట‌వ‌న్న‌ది ప్ర‌జ‌ల్లో ఫుల్ క్లారిటీ ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి లేక‌, కేంద్ర ప్రాజెక్టులు రాక విల‌విల్లాడుతుంటే ఆ దిశ‌గా ఏపీ బీజేపీ నాయ‌కులు చేస్తోన్న ప్ర‌య‌త్నాలు శూన్యం. ఇక బీజేపీ వేస్తోన్న మ‌త పాచిక‌ల విష‌యానికి వ‌స్తే దేశంలో వేరే చోట మత రాజకీయాలు వర్కౌట్ అవుతాయి గాని, ఏపీలో వర్కౌట్ అవ్వడం కష్టమే. ఓవ‌రాల్‌గా ఏపీలో బీజేపీ రాజ‌కీయ పోరాటం శూన్యంగానే ఉంది.