రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎ క్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇదీ.. మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమకు పీఆర్సీ అమలు చేయాలని.. కొత్త పీఆర్సీలో మార్పులు చేయాలని.. లేకపోతే.. రద్దు చేయాలని వారు పట్టుబడుతున్నారు. అంతేకాదు.. ప్రతి విషయంలోనూ.. ప్రభుత్వం ఉద్యోగులకు ఇబ్బందులు సృష్టిస్తోంద ని విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలతో అదరగొడుతున్నారు. నిజానికి రాష్ట్రంలో ఉద్యోగులు లేవనెత్తిన ప్రశ్నలు.. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆర్థిక మంత్రిగా బుగ్గనపై ఉంది.
అయితే.. ఆయన ఏపీలోనే లేకపోవడం.. గమనార్హం. ప్రస్తుతం కేంద్రంలో వార్షిక బడ్జెట్‌పై కసరత్తు జరుగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల పూర్తి, మూడు రాజధానుల నిధులు.. ఇలా అనేక సమస్యలపై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బుగ్గన ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు.. రాష్ట్రానికి కొత్తగా అప్పులు కావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో వాటిని సాధించేందుకు కూడా బుగ్గన ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఇక, ఇటీవల కేంద్రానికి అందిన కొన్ని ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరేవాటికి ఖర్చు చేస్తున్న అంశాలపై కూడా వివరణ ఇచ్చేందుకు ఆయన ఢిల్లీలోనే వారం రోజులుగా ఉన్నారు.
దీంతో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు సమాధానం చెప్పేవారు కరువయ్యారనేది వాస్తవం. అయితే.. ఈ బాధ్యతను సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే తీసుకోవడం గమనార్హం. మరోవైపు.. బుగ్గన లేకపోవడంపై ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన.. బుజ్జగింపుల కమిటీలో బుగ్గన కూడా ఉన్నారు.అ యితే.. ఆయన తాజాగా ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చి.. ఉద్యోగుల ప్రతినిధి బృందం నుంచి రిప్రజెంటేషన్‌ను తీసుకున్నారు. అంతకు మించి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం .. ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. అందుకే పీఆర్సీలో హెచ్ ఆర్ ఏను పెంచలేక పోతున్నాని చెబుతోంది. ఈ క్రమంలో.. అసలు ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన .. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను వివరించి ఉంటే బాగుండేదని.. సొంత పార్టీలోనూ చర్చసాగుతోంది. ఎవరో ఈ విషయాన్ని చెప్పే కన్నా.. నేరుగా మంత్రి రంగంలోకి దిగివివరిస్తే బాగుంటుందని.. అంటున్నారు. మరి బుగ్గన మాత్రం అటు కేంద్రంతో చర్చల్లోనే తలమునకలు కావడం గమనార్హం.