రాజకీయాలన్నాక విమర్శలు.. ఆరోపణలు మామూలే. రోటీన్ కు భిన్నంగా కొందరు నేతలు తమ చేతికి అధికారం వచ్చినంతనే.. తమకున్న అధికారంతో వేధింపులకు గురి చేసే ధోరణి కనిపిస్తుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్ని చూస్తే.. ఇవన్నీ ఇప్పటివరకూ ఒక మోస్తరు వరకేనని చెప్పాలి.
పగలు.. ప్రతీకారాలు మామూలే అయినప్పటికీ.. అత్యున్నత స్థానాల్లో ఉన్నోళ్లు ‘గీత’ దాటే పరిస్థితి చాలా తక్కువ సందర్భాలే కనిపిస్తాయి. రాజకీయ పగలన్నంతనే సీమ రాజకీయం గుర్తుకు రావటంతో పాటు.. వంగవీటి మోహన్ రంగా.. పరిటాల రవి.. లాంటి ఉదంతాలు గుర్తుకు వస్తాయి.
రాజకీయ ప్రేరేపిత హింసలే అయినప్పటికీ.. అత్యున్న స్థానాల్లో ఉన్నవారు నేరుగా రంగంలోకి దిగినట్లుగా బయటకు కనిపించేవి కావు. జరగాల్సినవి జరిగిపోతూ ఉండేవి. ఇలాంటి తీరుకు భిన్నంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగింది. వైఎస్ మరణం తర్వాత.. రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న తన ఆశను ఆయన దాచుకోలేదు. చాలామంది అభ్యంతరం వ్యక్తం చేసినా.. సంతకాల సేకరణను ఆపలేదు సరికదా.. నాటి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఊహించని సవాళ్లను విసిరారు.
ఒకరిపట్ల అయిష్టాన్ని పెంచుకుంటే.. వారిని ఒక పట్టాన వదిలిపెట్టని కాంగ్రెస్ అధినాయకత్వం జగన్ విషయంలో తన మార్కును చూపించింది. ఇదే.. జగన్ లాంటి నేతను మరింత కరకుగా మారేలా చేశాయని చెప్పాలి. తన తండ్రి కారణంగా అధికారంలోకి వచ్చిన పార్టీ.. తనను ఇబ్బంది పెట్టటాన్ని ఆయన సహించలేకపోయారంటారు. రాజకీయ వేధింపులకు పరాకాష్ఠ ఎలా ఉంటుందన్నది తనకే ఎదురుకావటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని చెబుతారు. ఒక రాజకీయ ప్రముఖుడి కుమారుడ్ని.. వ్యాపారవేత్తను.. భవిష్యత్తు సీఎంను చాలా సింఫుల్ గా జైలుపాలు చేసిన తీరును ఆయన ఎప్పటికి మర్చిపోరని చెప్పాలి.
చేతిలో ఉన్న అధికారంతో వ్యవస్థల్ని ఎలా ఆడిస్తారన్న విషయాన్ని చాలా చిన్నవయసులోనే తెలుసుకోవటం.. ఆ తరహా రాజకీయాలకు తాను బాధితుడ్ని కావటం జగన్ ధోరణిని మరింతగా మార్చి ఉంటుంది. ఈ కారణంతోనే కావొచ్చు.. ప్రజల విషయంలో ఎంత విశాలంగా వ్యవహరిస్తారో.. అందుకు విరుద్దంగా రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అంత ఇరుకుగా ఆలోచించే తీరు ఆయనలో అంతకంతకూ పెరిగి ఉంటుంది. ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత.. తన పాలనతో ప్రత్యర్థుల మనసుల్ని సైతం గెలుచుకుంటానని చెప్పిన ఆయన.. తన మాటలకు.. చేతలకు పొంతన ఉండదన్న విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు.
ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా తనపై విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా షాకివ్వటమే కాదు.. తన జోలికి రావాలన్నా భయపడేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. వ్యాపారం చేసే వారికి ఏ రీతిలో అయితే.. ఏదో ఒక లొసుగు ఉంటుందో.. రాజకీయం చేసే వాడికి అదే పరిస్థితి. ఒక ఎమ్మెల్యేకు నెలకు అయ్యే ఖర్చు దగ్గర దగ్గర రూ.15 నుంచి రూ.20 లక్షలుగా చెబుతారు. దీనికి అదనంగా ఎన్నికల వేళ రూ.10 నుంచి రూ.20 కోట్ల మధ్య ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందన్నది అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే.
ఇప్పటివరకూ రాజకీయంగా దెబ్బ తీసేందుకు అనుసరించిన విధానాలకు భిన్నంగా జగన్ నిర్ణయాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. జైల్లో ఉండి వచ్చాడు? ముద్దాయి? ఏ1 అంటూ తనను అదే పనిగా వేలెత్తి చూపే గురివిందల అసలు లెక్కల్ని ప్రజలకు తెలిసేలా చేయటమే లక్ష్యమని చెబుతున్నారు. వేలెత్తి చూపించేవారంతా సుద్దపూసలు కాదన్న సత్యాన్ని చట్టబద్ధంగా ఫ్రూవ్ చేయటంతో పాటు.. ఇలాంటివాళ్లా? తనను తప్పు పట్టేదన్న విషయాన్నిఅందరికి అర్థమయ్యేలా చేయటమే జగన్ లక్ష్యమన్నట్లుగా కనిపిస్తోంది. ఇదంతా రానున్న రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందన్నది ఇప్పుడే చెప్పటం కష్టం. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్ని సరికొత్తగా నిర్వచించే పనికి తెర తీసిన జగన్.. భవిష్యత్తు రాజకీయాల మీద ఆయన ముద్ర తప్పనిసరి.