చేతికి ఉన్న వేళ్లన్నీ ఒకేలా ఉండనట్టుగా.. వైసీపీలోనూ ఎమ్మెల్యేలు అందరూ ఒకేలా కనిపించడం లేదు. కొందరు ప్రభుత్వం ఏం చెబితే దానిని గుడ్డిగా అనుసరిస్తున్నారు. మరికొందరు మాత్రం తమ అజెండాను అమలు చేస్తున్నారు. ఇంకొందరు.. అసలు ఇవన్నీ ఎందుకులే.. అని వ్యాపారాలు.. వ్యవహారాల్లో మునిగిపోయి.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరంటే ఒకరికి ఎమ్మెల్యేలు.. గిట్టడం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరుపైచేయి సాధిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగుఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు..? తన నియోజకవర్గంలో ఎంపీ ఏం చేస్తున్నాడు? తనకు తెలిసే పనులు చేస్తున్నాడా? లేదా.. తనపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడా? అనే ఆలోచన ఎమ్మెల్యేలను కలవర పెడుతోంది.
ఈ క్రమంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వ్యవహరించి.. ఎంపీలు సహా పొరుగు నియోజకవర్గం ఎమ్మెల్యేల ఆనుపా నులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు అందివచ్చిన అవకాశాలను వారు వినియోగించుకుంటున్నా రు. ఈ క్రమంంలో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అద్భుతమైన ఐడియా వేశారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకీ రాని ఐడియా ఆయనకు వచ్చేసింది. దీంతో వెంటనే ఆయన ఆచరణలో కూడా పెట్టేశారు. అదే.. వలంటీర్లను మచ్చిక చేసుకోవడం. తన నియోజవకర్గంలో ప్రభుత్వం నియమించిన వలంటీర్లను ఆయన మచ్చిక చేసుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా.. తనకు క్షణాల్లో సమాచారం అందేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.
తన నియోజకవర్గంలో ప్రతి వలంటీర్‌కు వాస్తవానికి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉన్నారు. సో.. ఇంత మందికీ .. రాజా.. పర్సనల్ ఇన్సూరెన్స్ చేయించారు. వారికి ఏదైనా అయినా.. కుటుంబానికి రక్షగా ఉంటుందని.. చెబుతూ.. ప్రతి వలంటీర్‌కు రూ.2 లక్షల మేరకు ఇన్సూరెన్స్ చేయించారు. అది కూడా ఆయన సొంత నిధులు కేటాయించారు. భారీ ఎత్తునే ఖర్చు పెట్టారట.
అయితే.. నాయకులు ఏం చేసినా.. ఊరికేనే చేయరు కదా.. ఇదే విషయంపై సొంత పార్టీనేతలే కూపీ లాగారు. తీరా చూస్తే.. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌కు, రాజాకు పచ్చగడ్డి వేసిని భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎంపీ ఎక్కడైనా తనకు తెలియకుండా రాజకీయాలు చేస్తే.. వెంటనే ఉప్పందించేలా.. తన పక్షాన అనుకూల ప్రచారం చేసేలా.. ఖర్చులేని విధంగా వలంటీర్లను వాడుకునేందుకు రాజా ఇలా ప్లాన్ చేశారని వైసీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. మొత్తానికి ఈ ఐడియా ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates