సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ సర్కార్ ఓటర్లకు తాయిలాల లీకులను వదులుతోంది. ఎప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నా ఆర్థిక అంశాలకు సంబంధించి లీకులివ్వటం అలవాటుగా మారింది. ఎన్నికల్లో లబ్ది దొరికిందా సరే లేకపోతే మళ్ళీ ఆ ఊసును కూడా కేంద్రం పట్టించుకోవటం లేదు. ఆ మధ్య బీహార్ ఎన్నికల్లో గెలుపు కోసం, తర్వాత పశ్చిమబెంగాల్లో విజయం కోసం, ఇపుడు ఐదు రాష్ట్రాల్లో గెలుపు కోసం ఇలాంటి జిమ్మిక్కులే మొదులుపెట్టింది.
ఇంతకీ విషయం ఏమిటంటే పన్ను రహిత ప్రావిడెంట్ ఫండ్ పరిమితిని పెంచబోతోందనే లీకులు మొదలయ్యాయి. వచ్చే నెలలో ప్రవేశపెట్టబోయే 2022-23 బడ్జెట్లో ఇలాంటి ప్రతిపాదనలు ఉండబోతున్నాయంటు ప్రచారం మొదలైంది. పీఎఫ్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రు. 5 లక్షల వరకు జమ చేసుకునే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరికీ వడ్డీపై పన్ను ఉండదని ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించబోతున్నట్లు ప్రచారం మొదలైంది.
ప్రస్తుతం పీఎఫ్ ట్యాక్స్ ఫ్రీ పరిమితి రు. 2.5 లక్షలు మాత్రమే ఉంది. వచ్చే బడ్జెట్ తర్వాత నుంచి ప్రతి ఉద్యోగి పరిమితిని రు. 5 లక్షల వరకు ఉపయోగించుకోవచ్చునట. అంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్ధిక లబ్దిని ప్రైవేటు ఉద్యోగులకు కూడా అందించాలని కేంద్రం భావిస్తోందంటు కొన్ని వెబ్ సైట్లలో ప్రచారం మొదలైంది. నిజానికి గతంలో కూడా ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రచారాలు బీజేపీ చాలానే చేసింది. ఇన్ కమ్ ట్యాక్స్ పరిమితిని పెంచబోతోందని ఒకసారి, అసలు ఆదాయంపై ఇంత శ్లాబని చెప్పి ఫ్లాటుగా ట్యాక్స్ వసూలు చేసే ఆలోచనలో ఉందని మరోసారి ఇలా రకరకాలుగా ప్రచారాలు జరిగాయి.
స్విస్ బ్యాంకులో ఉన్న భారతీయుల ఖాతాల్లోని డబ్బును ఇండియాకు రప్పిస్తారని మొదట్లో ప్రచారం చేశారు. ఆ నల్లడబ్బును దేశానికి రప్పించి పేదల ఖాతాల్లో రు. 15 లక్షలు వేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా కలరింగ్ ఇచ్చి ప్రచారం చేయించుకున్నారు. ఎన్నికల తర్వాత అంతకుముందు జరిగిన ప్రచారం గురించి ఎవరైనా అడిగితే తామెప్పుడు అలా ప్రచారం చేయలేదని బుకాయించటం కమల నాదులకు అలవాటైపోయింది. ఇపుడిది కూడా సరిగ్గా ఎన్నికలకు ముందే మొదలవ్వటంతో దీన్ని కూడా ఎన్నికల్లో లబ్ది పొందే ప్లాన్ గానే అనుమానిస్తున్నారు. మరి బడ్జెట్ ప్రవేశపెడితే కానీ ఏ విషయం తేలదు.