మళ్లీ వార్తల్లోకి వచ్చింది హెరిటేజ్ సంస్థ. చంద్రబాబు కుటుంబానికి చెందిన ఈ సంస్థ పేరు తరచూ ఏదో ఒక వివాదానికి ముడిపెడుతూ వార్తలు వస్తుంటాయి. బాబు ప్రభుత్వ హయాంలో ఈ సంస్థకు చెందిన మజ్జిగ పాకెట్ల డీల్ భారీగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విలువ రూ.40 కోట్ల మేర ఉందన్న మాట హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. తమపై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తోంది హెరిటేజ్ సంస్థ. టీడీపీ హయాంలో ప్రభుత్వాలకు.. కొన్ని దేవాలయాలకు సరఫరా చేసిన మొత్తం మజ్జిగ ప్యాకెట్ల విలువ కేవలం రూ.కోటిన్నర మాత్రమేనని స్పష్టం చేసింది.
మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చిన హెరిటేజ్ సంస్థ.. తమపై వస్తున్న విమర్శల్లో నిజం లేదని స్పష్టం చేస్తోంది. దేవాలయాలు పిలిచిన టెండర్లలో పాల్గొని.. మొత్తం ఐదేళ్లలో కోటిన్నర విలువైన మజ్జిగ పాకెట్లు మాత్రమే సరఫరా చేశామని.. తమతో పాటు మరికొన్ని సంస్థలు కూడా సరఫరా చేశాయని వెల్లడించింది.
మజ్జిగ విషయంలో క్లారిటీ ఇచ్చిన హెరిటేజ్.. మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మూడేళ్ల కాలంలో తాము వంద గ్రాముల నెయ్యి పాకెట్లను సరఫరా చేశామని చెప్పింది. ఈ డీల్ విలువ రూ.21 కోట్లుగా పేర్కొనటం గమనార్హం. తమ సంస్థపై చేసే తప్పుడు ప్రచారం కారణంగా.. లక్షలాది మంది రైతాంగం నష్టపోయేలా చేస్తుందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా తమపై తప్పుడు ప్రచారం మంచిది కాదని హెరిటేజ్ పేర్కొంది.