ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకునే కొన్ని నిర్ణయాలు చూస్తే.. ఈయనేంటి కొరివితో తల గోక్కుంటున్నాడు అనిపిస్తుంది. సినిమా టికెట్ల ధరలు సహా చాలా విషయాల్లో అవనసరంగా జోక్యం చేసుకుని సమస్యలు కొని తెచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది. కానీ తనను సినిమా వాళ్లు తగినంత గౌరవం ఇవ్వట్లేదన్న ఇగోతో ఇలా చేశాడో.. పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతో చేశాడో కానీ.. సినిమా టికెట్ల వ్యవహారం మీద అనవసర రచ్చ జరిగి ప్రభుత్వమే అప్రతిష్ట పాలైందన్నది వాస్తవం.
ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో జగన్ సర్కారు డేంజర్ గేమ్ ఆడుతోంది. జీతాలు పెంచకపోగా.. ఉన్న వాటిలో కోత పడేలా పీఆర్సీని అమలు చేస్తుండటం, అన్ని రకాలుగా తమకు అన్యాయమే జరుగుతుండటంతో ఉద్యోగులు జగన్ సర్కారు మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంలో బొత్స సత్యనారాయణ, కొడాలి నాని లాంటి మంత్రులు మాట్లాడుతున్న తీరు.. సోషల్ మీడియాలో వైకాపా మద్దతుదారుల పోస్టులు చూస్తే పుండు మీద కారం చల్లినట్లే ఉంటోంది.
ఐతే జగన్ సర్కారు ఇవన్నీ అనాలోచితంగా ఏమీ చేయట్లేదని, ఒక వ్యూహం ప్రకారమే ఇదంతా జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే వాళ్లను ఎంతకీ సంతృప్తి పరచలేమని.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది ఓ మోస్తరు భారాన్ని కూడా మోసే పరిస్థితి లేదని.. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విషయంలో తాడో పేడో తేల్చుకోవడానికి కూడా సిద్ధమన్న ఆలోచనతో జగన్ సర్కారు ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా మారితే ఎన్నికల్లో కష్టం కదా అన్న ప్రశ్న తలెత్తొచ్చు. కానీ తమ ఓటు బ్యాంకు తమను కాపాడుతుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు, పేదలు తమకు అండగా నిలుస్తారని.. అలాంటపుడు 2 లక్షల కుటుంబాల ప్రభుత్వ ఉద్యోగులతో తమకు వచ్చే ముప్పు తక్కువే అని జగన్ ప్రభుత్వం అంచనా వేస్తోందట.
ఇక్కడ ఇంకో వ్యూహం ఏంటంటే.. సంపన్న వర్గాలు, పేదల మధ్య ఒక రేఖ గీసి, పేదలకు వారి మీద కోపం, అసూయ కలిగేలా చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని.. అందుకే భారమంతా ఉద్యోగులు, మధ్య తరగతి, సంపన్న వర్గాల మీద మోపుతూ పేదలకు మాత్రం పథకాల విషయంలో ఏ లోటూ రాకుండా చూస్తూ.. అవతలి వర్గంలో తమ పట్ల వ్యతిరేకత పెరిగినా పర్వాలేదని.. కచ్చితంగా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓట్లు వేసేది, ఫలితాలను నిర్దేశించేది గ్రామీణులు, పేదలే అన్న ఆలోచనతో జగన్ సర్కారు ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఈ డేంజర్ గేమ్ జగన్‌కు ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి.