మూడు రాజ‌ధానుల మాదిరే.. పీఆర్సీ కూడా!

ఏపీ సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారా?  ఉద్యోగుల ఉద్య‌మ తీవ్ర‌త పెరుగుతున్న‌నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేయాల‌ని నిర్ణ‌యించుకుందా?  ప్ర‌స్తుతం తీసుకున్న పీఆర్సీ నిర్ణ‌యాన్ని స‌ర్కారు వెన‌క్కి తీసుకునేందుకు నిర్ణ‌యించిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కొన్ని కార‌ణాల నేప‌థ్యంలో రాష్ట్ర స‌ర్కారు కొన్నాళ్లు ప‌ట్టుబ‌ట్టిన మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న విష‌యం తెలిసిందే. మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్ర‌క‌టించిన స‌ర్కారు.. త‌ర్వాత‌.. దీనిని వెన‌క్కి తీసుకుంది. అదేవిధంగా ఇప్పుడు పీఆర్ సీ విష‌యంలోనూ వెంట‌నే వెన‌క్కి త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తు న్నట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన పీఆర్సీ ద్వారా..త‌మ వేత‌నాలు త‌గ్గుతున్నాయ‌ని.. ఉద్యోగులు ఆందోళ‌న‌కు దిగారు. అన్ని సంఘాల ఉద్యోగులుకూడా ఏక‌తాటిపైకి వ‌చ్చి.. స‌ర్కారుపై ఉద్య‌మించేందుకు రెడీ అయ్యారు. ఈక్ర‌మంలో ప్ర‌భుత్వానికి రెండు అవ‌కాశాలు ఉన్నాయి. ఒక‌టి వారిని న‌యాన ఒప్పించ‌డం. రెండు ఎస్మా చ‌ట్టాన్ని ప్ర‌యోగించ‌డం. అయితే.. రెండోది ప్ర‌యొగిస్తే.. ఇది రాష్ట్రంలో తీవ్ర దుమారం రేప‌డంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపిస్తుంద‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. ముఖ్యంగా త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జా ప్ర‌బుత్వ‌మని చెప్పే వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ఇప్పుడు ఎస్మా ప్ర‌యోగిస్తే.. ఆయ‌న‌కు మాయ‌ని మ‌చ్చ‌గా చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎస్మా వైపు దృష్టి పెట్టే సాహ‌సం చేయ‌ర‌ని తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల‌ను న‌యాన త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయనున్నార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం నిర్వ‌హించే రాష్ట్ర కేబినెట్ సమావేశంలోపలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం క‌నిపిస్తోంది. ముఖ్యంగా పీఆర్సీ విషయంపై అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు వార్‌ నడుస్తున్న‌నేప‌థ్యంలో కొత్త  పీఆర్సీతో పాటు దాని ఇచ్చిన జీవోలను  వెంటనే ఉపసంహరించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.  

దీనిని మ‌రింత నాన్చ‌డం ద్వారా.. ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌.. ఒక అడుగు వెన‌క్కి వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. పైగా దీనికి సంబంధించిన న్యాయ‌పోరాటాల‌కు కూడా చెక్‌పెట్టాల‌ని భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. మూడు రాజ‌దానుల మాదిరిగా పీఆర్సీ ని కూడా స‌ర్కారు వెన‌క్కి తీసుకున్న‌ట్టు అవుతుంది. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.