వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో కేసు వేశారు. తనపై ఏపీసీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలన్నారు. తనపై దురుద్దేశ్యంతో సీఐడీ ఏడీజీ పెట్టిన కేసు కాబట్టి దానికి విచారణ అర్హత లేదని రాజు తన పిటీషన్లో చెప్పారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కూడా కొట్టేయాలని, తనను విచారణ పేరుతో ఇకముందు నోటీసులు కూడా ఇవ్వకుండా సీఐడీని నిలుపుదల చేయాలని కూడా ఎంపీ తన పిటిషన్లో అభ్యర్ధించారు.
మొన్నటి 11వ తేదీన హైదరాబాద్ లో ఎంపీని కలిసిన సీఐడీ అధికారులు విచారణకు హాజరవ్వాలంటు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అయితే పండగ సమయంలో విచారణకు సాధ్యం కాదని చెప్పిన ఎంపీ 17వ తేదీ మంగళగిరిలో సీఐడీ ఆఫీసుకు వస్తానని చెప్పారు. దాంతో అధికారులు కూడా అంగీకరించారు.
అయితే అదేరోజు ఎంపి ఢిల్లీకి వెళ్ళి తన లాయర్లను కలిశారు. అప్పటినుండి మళ్ళీ ఏపికి తిరిగి రాలేదు. పైగా తనకు అనారోగ్యంగా ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని సీఐడీ లేఖ రాశారు. తన పిటీషన్ పై కోర్టు ఏదో నిర్ణయం తీసుకునేంతవరకు ఎంపీ సీఐడీకి అందుబాటులోకి వెళ్ళకూడదని డిసైడ్ అయినట్లున్నారు.
తనపై సీఐడీ పెట్టిన, పెడుతున్న కేసులను ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా ఎంపీ వివరించారు. సీఐడీ ఉన్నతాధికారి సునీల్ కుమార్ ను వెంటనే ఏపీ క్యాడర్ నుంచి ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని కూడా కోరారు. రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం తనకు చాలా అవసరమన్నారు. అప్పటి వరకు తాను జీవించి ఉండాలని ఎంపీ మీడియాతో చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.