ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 107 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. తొలివిడత ఎన్నికలు జరిగే 58 స్థానాలకు 57 మంది అభ్యర్థులను, రెండో విడతలో ఎన్నికలు జరిగే 55 స్థానాలకు 38 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. వీరిలో 44 మంది ఓబీసీకి చెందిన నేతలు కాగా.. 19 మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు.
ప్రస్తుతం ప్రకటించిన 107 స్థానాల్లో 83 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా.. వీరిలో 63 మందికే మరోసారి అవకాశం లభించింది. మిగతా 20 మందికి టికెట్ కేటాయించలేదు. ఇక, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. యోగి సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో యోగి పేరు ఉండడం విశేషం. అదేవిధంగా ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. సిరాతు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.
అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మౌర్య ఆగ్రా రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ ప్రకటించినజాబితాలో మౌర్యకు కూడా అవకాశం కల్పించారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ నోయిడా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడం విశేషం.
ఉత్తర్ప్రదేశ్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు ప్రకటిస్తారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే, అటు కేంద్రప్రభుత్వం.. ఇటురాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో బీజేపీ విజయపరంపర మరోసారి కొనసాగుతుందనే అంచనాలు వెలువడుతుండడం గమనార్హం.