ఏపీ సీఎం జగన్ దగ్గర చనువు అంటే మాటలు కాదు. ఎంతో సీనియర్ అయిన నాయకుడు కూడా జగన్ దగ్గరకు వచ్చే సరికి .. జంకుతాడు. జగన్ పక్కన కూర్చొనేందుకు, ఆయనతో మాట్లాడేందుకు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించే నాయకులు ఉన్నారు. కేవలం ఇద్దరు ముగ్గురు మంత్రులకు మాత్రమే.. సీఎం జగన్ దగ్గర చనువు ఉంది. ఇలాంటివారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని వంటివారు ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరి సరసన మరో మంత్రి కూడా చేరిపోయారా? అనే చర్చ సాగుతోంది. తాజాగా ఏపీ సీఎం జగన్ నివాసంలో భోగి పండుగ సంబరాలు సాగాయి.
అత్యంత అట్టహాసంగా నిర్వహించిన ఈ సంబరాల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ సంప్రదాయ పంచె కట్టుతో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి కూడా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షించారు. ఇక, ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు కూడా హాజరయ్యారు. అయితే.. వీరిలో అందరికన్నా ప్రత్యేక ఆకర్షణగా మారిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస్. వాస్తవానికి ఆయన విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సీఎం నివాసంలో జరిగిన భోగి వేడుకలకు మధ్యలో హాజరయ్యారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం జగన్.. ఆయనను ఆప్యాయంగా పలకరించడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు.. ముఖ్యమంత్రి దంపతులు.. కూర్చుని భోగి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆట పాటలను తిలకించేందుకు ఒక మంచం ఏర్పాటు చేశారు. దీనిపై సీఎం, ఆయన సతీమణి భారతి ఇరువురు కూర్చున్నారు అయితే.. అక్కడ చాలా మంది నేతలు.. మంత్రులు.. కూడా నిలబడే కార్యక్రమాన్ని తిలకించారు.
కానీ, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వచ్చే సరికి మాత్రం సీఎం జగన్ స్వయంగా.. ఆయనను చేయి పట్టుకుని లాగి మరీ.. తన పక్కన కూర్చోబెట్టుకోవడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సీఎం దగ్గర ఇంత చనువు ఉందా? అని నాయకులు చర్చించుకోవడం గమనార్హం. “ఎన్నో నెలల తరబడి.. నిత్యం క్యాంపు ఆఫీస్కు వస్తున్నా.. ఇప్పటి వరకు నాకు కనీసం.. కూర్చునే అవకాశం కూడా రాలేదు. కానీ. మంత్రి వెలంపల్లి లక్కీ ఛాన్స్ కొట్టేశాడుగా!“ అని కీలక నేత ఒకరు వ్యాఖ్యానించడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates