కొత్త గూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు తనయుడు రాఘవ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో పెను దుమారమే రేగుతోంది. వ్యాపారి రామకృష్ణ ఆత్మహత్యకు రాఘవ కారణమంటూ వచ్చిన ఆరోపణలు రాష్ట్ర ప్రజలను ఉలిక్కి పడేలా చేశాయి. ఈ వ్యవహారంపై విచారం వ్యక్తం చేస్తున్న జనాలు రాఘవను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి రాఘవను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. అయితే తనయుడు తెచ్చిన తలవంపులు ఇప్పుడు వెంకటేశ్వర్రావు రాజకీయ భవిష్యత్‌కు ముగింపు పలికేలా కనిపిస్తున్నాయి. అదే సమయంలో జలగం వెంకట్రావుకు మాత్రం లాభం చేకూరే ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సంఘటనతో..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపారి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య.. ఆ తర్వాత వెలుగులోకి వస్తున్న రాఘవ అరాచకాలు వెంకటేశ్వర్రావుకు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ తరపున గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన వనమా వెంకటేశ్వర్రావు విషయంలో మాత్రం ఇప్పటివరకూ పార్టీ అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకోలేదు. ఆయన విషయంలో పార్టీ వేచి చూసే ధోరణి అవలంబిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండడంతో రాఘవపై కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని దాని ప్రభావం వెంకటేశ్వర్రావుపై కూడా పడుతుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇమేజీ డ్యామేజీ..
వనమా రాఘవ కారణంగా ఆయన తండ్రి వెంకటేశ్వర్రావు ఇమేజీ భారీగానే డ్యామేజీ అయింది. దీంతో ఆయనకు మళ్లీ వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం వస్తుందో లేదో అనే చర్చ మొదలైంది. ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చే అవకాశమే లేదని అది జలగం వెంకట్రావుకు కలిసొచ్చే వీలుందని నిపుణులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ తరపున జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వెంకట్రావు మాత్రమే. కానీ 2018 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్ తరపున గెలిచిన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్రావు టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి వనమా, జలగం వర్గాల మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి.
ఇప్పుడు అవకాశం..
వనమా వెంకటేశ్వర్రావు టీఆర్ఎస్‌లో చేరడంతో వచ్చే ఎన్నికల్లోనూ తనకు టికెట్ దక్కడమే అని జలగం వెంకట్రావు భావించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. బీజేపీ ఆయన్ని చేర్చుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలెట్టిందనే ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు రాఘవ ఎపిసోడ్ కారణంగా కొత్తగూడెంలో పోటీ చేసే అవకాశం మళ్లీ వెంకట్రావుకే దక్కుతుందని ఆయన వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వనమా కారణంగా నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్న జలగం వెంకట్రావుకు ఇప్పడు పరిస్థితులు అనుకోని విధంగా కలిసొచ్చాయనే చర్చ జోరందుకుంది.