వైసీపీ రెబల్ ఎమ్మెల్యే.. నిత్యం ప్రభుత్వ పథకాలపై విశ్లేషణలతో రాజీయాలను హీటెక్కిస్తున్న కనుమూరి రఘురామకృష్ణరాజు.. ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ త్వరలోనే తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు సంచలన ప్రకటన చేశారు. నిజానికి గడిచిన రెండేళ్లుగా ఆయన పార్టీలోనే ఉన్నా.. ఆయనపై అనర్హత వేటు వేయించే దిశగా.. వైసీపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా ఇవ్వడం.. దీనిని ఆమోదించేలా వారిపై ఒత్తి ళ్లు చేస్తున్న విషయం తెలిసిందే.
వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు.. ప్రజాస్వామ్య బద్ధంగా లేవంటూ.. ఆర్ ఆర్ ఆర్ తరచుగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కోర్టు నిర్ణయాలను తీర్పులను కూడా తప్పుబట్టడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేస్తున్న దుబారా వ్యయం.. ఇతర పథకాల రూపంలో ప్రజాధనాన్ని అభివృద్ధి కి కకేటాయించక పోవడాన్ని కూడా నిలదీస్తున్నారు. దీంతో వైసీపీలోనే ఆయనను పక్కన పెట్టారు. రెబల్‌గా ముద్ర వేశారు. ఈ క్రమంలోనే ఆయనపై వేటు వేయాలంటూ.. వైసీపీ ఎంపీలు.. స్పీకర్‌కు లేఖ కూడా రాశారు. అయితే.. ఇది ఇంకా పెండింగులోనే ఉంది.
ఇదిలావుంటే.. సోషల్ మీడియాలోనూ రఘురామ పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని.. దమ్ముంటే.. తన ఫొటో ముందు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని కూడా వైసీపీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ.. రఘురామ చలించలేదు. కానీ, ఇప్పుడు విసిగిపోయిన ఆయన.. పార్టీకి, తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, తనపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. అనర్హత వేటు వేయించేందుకు సమయం ఇస్తున్నానని చెప్పిన ఆయన అనర్హత వేటు వేయకపోతే తానే రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని చెప్పారు. తన ఫొటోతోనే గెలుపు గుర్రం ఎక్కి.. వైసీపీకి షాక్ ఇస్తానని ప్రకటించారు.
పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానని చెప్పారు. పార్టీ నుంచి తొలిగించాలని యత్నించినా సాధ్యం కాలేదని అన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలించేందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాజధానిగా అమరావతి కొనసాగింపునకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రఘురామ స్పష్టం చేశారు. అయితే.. ఎప్పుడు రాజీనామా చేసేదీ త్వరలోనే ప్రకటిస్తానని చెప్పడం గమనార్హం.