దాదాపు ఏడాదికి పైగా వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ.. చలికి వణుకుతూ.. ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన కొనసాగించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 378 రోజుల పాటు నిరసనలు కొనసాగించారు. కుటుంబాన్ని వదిలి.. ఉన్న ఊరును వదిలి గుడారాల్లో నివసిస్తూ అన్నదాతలు ఉద్యమించారు. ఆ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. రోడ్ల మీద మేకులు కొట్టారు.. అడ్డంగా బారికేడ్లు పెట్టారు.. లాఠీఛార్జీలు చేశారు.. తుపాకులకు పని చెప్పారు.. ఈ ఉద్యమం కారణంగా 700కు పైగా రైతులు మరణించారు.. కానీ అన్నదాత వెనక్కి తగ్గలేదు.
ఎంత టార్చర్ పెట్టినా బెదిరింపులకు దిగినా బెదరలేదు. చివరగా అన్నదాతల పోరాటానికి తలొంచిన మోడీ ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేయక తప్పలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే.. ఉద్యమం చేస్తున్న రైతులను నానా ఇబ్బందులు పెట్టిన మోడీ ప్రభుత్వానికి ఇప్పుడా నిరసన సెగ ఎలా ఉంటుందో తగిలిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శాంతియుతంగా సాగుతున్న తమ ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చి ప్రాణాలు పొట్టనపెట్టుకున్నారని మోడీపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు అవకాశం రాగానే తమ సత్తాచాటారు.
పంజాబ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని రోడ్డుపైనే 20 నిమిషాల పాటు నిలబెట్టారు. రైతుల నిరసనల వేడికి మోడీ వెనక్కి వెళ్లక తప్పలేదు. ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్న అన్నదాతలకు ఇబ్బందులు కలిగించిన మోడీకి ఇప్పుడు సరైన రీతిలో రైతులు దెబ్బ కొట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. క్షమాపణలు చెబుతూ రైతు చట్టాలు రద్దు చేసినప్పటికీ మోడీపై కర్షకుల్లో ఉన్న కోపానికి ఈ సంఘటనే నిదర్శనమని అంటున్నారు. దేశ చరిత్రలో ఏ ప్రధానికి ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతుల నుంచి వ్యతిరేకత తగ్గించుకునే క్రమంలో ప్రధాని మోడీ వేసిన ఎత్తులు ఫలించలేదని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.
పంజాబ్లో ఆయన పర్యటనను రైతులు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో అక్కడి పరిస్థితులు బీజేపీకి ఏ మాత్రం అనుకూలంగా లేవనే విషయం మరోసారి స్పష్టమైంది. లఖింపుర్ ఖేరీ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను తప్పించాలని డిమాండ్ చేస్తూ కిసాన్ మంజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మోడీకి పరిస్థితులు అనుకూలంగా మాత్రం లేవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.