వైసీపీ పాలనపై కొంతకాలంగా సొంత పార్టీ నేతలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో టెర్రరిజం, నక్సలిజం పోయాయని కానీ, లోకల్ మాఫియా పెరిగిపోయిందని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాం నారాయణ రెడ్డి చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు…ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉపాధి హామీ పథకం తీరుపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 గంటల పనికి డబ్బులు వేసేస్తుంటే.. ఓ పూట పని ఉండే వ్యవసాయానికి కూలీలు ఎందుకు వస్తారని ధర్మాన ప్రశ్నించారు. వ్యవసాయానికి కూలీలు వెళ్లకూడదు అనే విధంగా ఆ పథకాన్ని అమలు చేస్తే రైతులు బ్రతకరని షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ తరహా పథకాలు దేశ నాశనానికి దారి తీస్తాయని, ఇలాంటి పోరంబోకులను తయారు చేసే పద్దతి వ్యవసాయానికి దెబ్బ అని అన్నారు.
రైతులకు ఏమైనా ఫర్వాలేదనుకుంటే ఆ పథకం అమలులో ఈ పద్దతినే ప్రభుత్వం కొనసాగించాలని అన్నారు. అయితే, వ్యవసాయ కూలీలకు పని దొరకనపుడు ఈ పథకం కింద పని ఇవ్వడంలో తప్పులేదని చెప్పారు. సంక్షేమ పథకాలతో డబ్బులు పంచుతున్నాం కాబట్టే రాష్ట్రంలో రోడ్లు, ప్రాజెక్టులు వంటి అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయని, రెండూ చేయడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. పెన్షన్ పెంచామని అంటే.. నూనె ధరలు పెరగలేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని తమ ప్రభుత్వ తీరుపై ధర్మాన చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.
దేశంలో రైతుల బ్రతుకులు ఎక్కడా బాగోలేదని, వ్యవసాయం కష్టకాలంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారని, ఇపుడు, ఎంతో కష్టపడి వరి పండిస్తే కొనేవాడు లేడని, అమ్మినా సజావుగా డబ్బులిచ్చేవాడు లేడని అన్నారు. 80 కేజీల ధాన్యానికి కనీసం 3 వేల రూపాయల ధర ఉండాలని చెప్పారు. మరి, ధర్మాన కామెంట్లపై జగన్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates