2021: బాబును ఏడిపించిన ఏడాది

నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ ప్ర‌స్థానం.. మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి సొంతం. రాజ‌కీయాల్లో ఎన్నో ఒడుదొడుకులు దాటిన ఆయ‌న‌.. ఎంతో మంది మ‌హామ‌హుల‌తో ఢీ కొట్టారు. కానీ త‌న రాజ‌కీయ జీవితంలో తొలిసారి ఈ ఏడాదే క‌న్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో బాబును ఏడిపించిన ఏడాదిగా 2021 నిలిచిపోతుంది. న‌ల‌భై ఏళ్ల త‌న రాజ‌కీయ జీవితంలో ఇలాంటి ఏడాదిలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు బాబు మునుపెన్న‌డూ చూసి ఉండ‌రు. ఆయ‌న‌కు ఈ ఏడాది చేతు అనుభ‌వాల‌ను మిగిల్చింది.

పుంజుకోలేదు..
2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేతిలో చావుదెబ్బ తిన్న బాబు దాని నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేక‌పోతున్నారు. ఈ రెండేళ్ల‌లో పార్టీ పెద్ద‌గా పుంజుకున్న‌దే లేదు. ఈ ఏడాది జ‌రిగిన పంచాయ‌తీ, ప‌రిష‌త్‌, మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో టీడీపీకి ఘోర‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎన్న‌డూ లేని విధంగా కేవ‌లం 14 పంచాయ‌తీల‌నే టీడీపీ ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ తీరును వ్య‌తిరేకిస్తూ బాబు పరిష‌త్ ఎన్నిక‌లు బ‌హిష్క‌రించారు. ఆయ‌న పార్టీ బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించ‌డం ఇదే తొలిసారి. ఈ నిర్ణ‌యాన్ని కొంత‌మంది టీడీపీ నేత‌లే విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.

కంచుకోట‌కు బీట‌లు..
చంద్ర‌బాబుకు కంచుకోట కుప్పానికి ఈ ఏడాది బీట‌లు వారాయి. బాబు నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చినా రాక‌పోయినా అక్క‌డి ప్ర‌జ‌లు ఆయ‌న్ని గెలిపిస్తూ వ‌చ్చారు. ఏడుసార్లు ఆయ‌న అక్క‌డి నుంచి గెలిచారు. కానీ 2021లో మాత్రం వైసీపీ జోరు ముందు కుప్పం బాబు చేతిలో నుంచి జారిపోయేలా క‌నిపిస్తోంది. ఈ ఏడాది అన్ని ఎన్నిక‌ల్లోనూ కుప్పంలో టీడీపీకి ప్ర‌తికూల ఫ‌లితాలే వ‌చ్చాయి. చివ‌ర‌కు బాబు స్వ‌యంగా మున్సిపాలిటీ ఎన్నిక‌ల‌కు ముందు అక్క‌డ ప‌ర్య‌టించిన‌ప్ప‌టికీ ఆ ఎన్నికల్లో దెబ్బ త‌ప్ప‌లేదు.

దాడులు..
ఈ ఏడాది చంద్ర‌బాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ దాడికి ప్ర‌య‌త్నించారు. మ‌రోవైపు జ‌గ‌న్‌ను టీడీపీ నేత ప‌ట్టాభి తిట్టార‌ని వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు చేశాయి. దీనికి నిర‌స‌న‌గా బాబు 36 గంట‌లు దీక్ష చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రప‌తికి ఫిర్యాదు చేశారు. ఇక అసెంబ్లీ స‌మావేశ‌ల సంద‌ర్భంగా స‌భ‌లో త‌న భార్య‌పై వైసీపీ నాయ‌కులు అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని మీడియా స‌మావేశంలో బాబు క‌న్నీళ్లు పెట్టుకున్నారు. తిరిగి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే శాస‌న స‌భ‌లో అడుగుపెడ‌తాన‌ని శ‌ప‌థం చేశారు.