త‌న‌య‌ను రంగంలోకి దించుతున్న నారాయ‌ణ‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేతిలో టీడీపీ దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత ఆ పార్టీలోని చాలా మంది సీనియ‌ర్ నేత‌లు తెర‌మీద‌కు రావ‌డం లేదు. అందులో మాజీ మంత్రి నారాయ‌ణ కూడా ఒక‌ర‌నే అభిప్రాయాలున్నాయి. ఆయ‌న చాలా కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. టీడీపీ ఓట‌మి త‌ర్వాత పూర్తిగా త‌న విద్యా సంస్థ‌ల వ్య‌వ‌హారాల్లోనే త‌ల‌మున‌క‌లై ఉంటున్నార‌ని స‌మాచారం. నెల్లూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ప్పుడు కూడా ఆయ‌న క‌నిపించ‌లేదు. తెర‌వెన‌క ఆర్థిక సాయం అందించార‌న్న మాటే కానీ తెర‌మీద‌కు రాలేదని టాక్‌. కానీ ఇటీవ‌ల క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఆయ‌న నెల్లూరులో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

క్రిస్మ‌స్ సంద‌ర్భంగా నెల్లూరుకు వ‌చ్చిన నారాయణ‌.. త‌న త‌న‌య శ‌ర‌ణితో క‌లిసి వేడుక‌ల్లో పాల్గొన‌డం విశేషం. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌పున త‌న కూమార్తెను బ‌రిలో దించేందుకు ఆయ‌న రంగం సిద్ధం చేస్తున్నార‌నే ప్ర‌చారం మొద‌లైంది. అందుకు రెండేళ్ల ముందుగానే త‌న కూతురును నెల్లూరు రాజ‌కీయాల‌కు ప‌రిచ‌యం చేస్తున్నార‌ని తెలిసింది. రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీ మంత్రి అనిల్‌కు ప్ర‌త్య‌ర్థిగా శ‌ర‌ణి పోటీ చేస్తార‌నే టాక్ న‌డుస్తోంది. శ‌ర‌ణి మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు కోడ‌లు కూడా. ఇటు పుట్టినింట్లో.. అటు మెట్టినింట్లో కూడా ఆమెకు పొలిటిక‌ల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది.

గ‌త ఎన్నిక‌ల్లో అప్ప‌టి మంత్రి నారాయణ స్వ‌ల్ప తేడాతో అనిల్ చేతిలో ఓడిపోయారు. నెల్లూరుకు చేసిన అభివృద్ధి ప‌నుల కార‌ణంగా ఆయ‌న గెలుస్తార‌నే అనుకున్నారు. కానీ చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో అప్పుడు వ‌చ్చిన వ్య‌తిరేక‌త కార‌ణంగా ఓడిపోయార‌ని రాజ‌కీయ  నిపుణులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానాన్ని సొంతం చేసుకునే దిశ‌గా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కూతురును దించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. త‌న సామాజిక వ‌ర్గాన్ని ఒక్క తాటిపైకి తెచ్చేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

మ‌రోవైపు నెల్లూరు వైసీపీ నాయ‌కుల మ‌ధ్య ప్ర‌స్తుతం విభేదాలున్నాయి. ఎమ్మెల్యేల్లో ఒక‌రంటే మ‌రొక‌రికి ప‌డ‌డం లేద‌నేది తెలిసిన విష‌య‌మే. ఈ విష‌యంలో ఇప్ప‌టికే స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి వ‌ద్ద మూడు సార్లు పంచాయ‌తీ జ‌రిగింది. ఇంఛార్జీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి జోక్యం చేసుకున్నా ప‌రిస్థితి ఏ మాత్రం మార‌లేదు. నెల్లూరు సిటీలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, అనిల్కు మ‌ధ్య వైరం న‌డుస్తుంద‌ని స‌మాచారం. దీన్ని అదునుగా తీసుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న త‌న‌య‌ను నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిపించుకోవాల‌ని నారాయ‌ణ అనుకుంటున్నార‌ని టాక్‌.