వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. హత్య చేసేందుకు రిక్కీ కూడా నిర్వహించారని తెలిపారు. గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధా ఉద్వేగభరితంగా మాట్లాడారు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా రాధా గుర్తుచేసుకున్నారు. రంగా కీర్తి, ఆశయాల సాధనే తన లక్ష్యం, పదవులపై తనకు ఆశ లేదని స్పష్టం చేశారు. తనను ఏదో చేద్దామని రెక్కీ నిర్వహించారని, తాను భయపడనని, అన్ని వేళలా తాను సిద్ధమని తెలిపారు. తనను పొట్టన పెట్టుకోవాలనే అనుకునే వారికి తాను భయపడనని, ప్రజల మధ్యే ఉంటానని ప్రకటించారు. తనను లేకుండా చెయ్యాలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలని రాధా కోరారు.
అయితే తనను ఎందుకు చంపాలని ఎవరు కుట్ర చేస్తున్నారు. ఎందుకు కుట్ర చేస్తున్నారు అనే దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కొద్ది రోజుల్లోనే ఎవరూ రిక్కీ నిర్వహించారు అనే దానిపై స్పష్టత వస్తుందని తెలిపారు. రాధా చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కూడా అంతర్గత సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు భద్రత పెంచాలనే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో రాధా ఉన్నారా? లేకపోతే ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారా? లేక చట్టపరంగా ముందుకు వెళ్తారా? అనే దానిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రంగా విగ్రహావిష్కరణలో కొడాలి నాని, వల్లభనేని వంశీ పాల్గొన్నారు. రాధా, నాని, వంశీ ముగ్గురు మంచి స్నేహితులు. పార్టీలు వేరైనా వీరి మధ్య స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడలో ఉన్న రాధా కార్యాలయానికి ఉదయం వంశీ వచ్చారు. అక్కడి నుంచి గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరించారు. ఈ సందర్భంగా రాధా చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. అయితే రాధా ఎవరి ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై స్పష్టత రాలేదు.
రాధా ఉదయం రంగా విగ్రహానికి నివాళుర్పించిన తర్వాత విజయవాడలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెడన్ పట్టణంలో రెండు చోట్ల, ఆ తర్వాత గుడివాడలో పశ్చిమగోదావరి జిల్లాలో విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో వరుసగా రాధా పాల్గొన్నారు. రాధా ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే వైసీపీలో కీలక నేతగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీతో రాధా తన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates