విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తమ్ముళ్ళు మండిపోతున్నారు. ఇంతకాలం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలను చూస్తున్న నేతలను తప్పించి చంద్రబాబునాయుడు కొత్తగా ఎంపీకీ అప్పగించటాన్ని తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే చంద్రబాబు నిర్ణయంతో పాటు నియమితుడైన ఎంపీ మీద కూడా తమ్ముళ్ళు మండిపోతున్నారు. తాజాగా మొదలైన వివాదానికి పెద్ద చరిత్రమే ఉంది.
విజయవాడలో ఎంపీ నాని అంటే మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, సీనియర్ నేత నాగుల్ మీరా వర్గాలకు ఏమాత్రం పడదు. విషయం ఏదైనా వీళ్ళమధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగే ఉంటుంది. వీళ్ళమధ్య సయోధ్య చేద్దామని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు చాలాసార్లు ఫెయిలయ్యాయి. ఇలాంటి నేపధ్యంలో పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతలను చంద్రబాబు ఎంపీకి అప్పగించారు.
గడచిన రెండున్నరేళ్ళుగా ఈ బాధ్యతలను బుద్దా, నాగుల్ జాయింట్ గానే చూస్తున్నారు. అలాంటిది చెప్పా పెట్టకుండా వీళ్ళద్దరిని మార్చేసి కొత్తగా ఎంపీకి బాధ్యతలు ఎందుకిచ్చారో ఎవరికీ అర్ధం కావటంలేదు. చంద్రబాబు నిర్ణయం బయటకు రాగానే ఎంపీ వ్యతిరేకవర్గం ఒక్కసారిగా మండిపోయింది. పార్టీ ఆఫీసుముందు రచ్చ రచ్చ చేశారు. అలాగే బుద్ధా ఇంట్లో సమావేశమైన నేతలు, కార్యకర్తలు చంద్రబాబు, ఎంపీ వైఖరిపై మండిపోయారు.
పై రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చాలా తీవ్రంగా నడుస్తోంది. అలాంటిది రెండువర్గాలను కాదని చంద్రబాబు కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగించుంటే బాగుండేది. కనీసం కొంతకాలమైనా రెండువర్గాలు ప్రశాంతంగా ఉండేవి. అయితే చంద్రబాబు అలా చేయకుండా కొంతకాలం ఒక వర్గానికి ఇంకొంత కాలం మరోవర్గాన్ని దగ్గరకు తీసుకుంటున్న కారణంగా రెండు వర్గాల మధ్య విభేదాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయే కానీ తగ్గటంలేదు.
అసలు కేశినేని పార్టీలో అనుమానమని ఆమధ్య జరిగిన ప్రచారం అందరికీ తెలిసిందే. చంద్రబాబుతో కాదు ఏకంగా పార్టీ కార్యక్రమాలతో కూడా చాలాకాలం సంబంధం లేకుండానే ఉన్నారు. అలాంటిది కొంతకాలంగా చంద్రబాబుకు దగ్గరయ్యారు. దీంతో ఆయన వ్యతిరేకవర్గం మండిపోతోంది. ఇష్టం లేనపుడు పార్టీకి దూరంగా జరగటం, ఇష్టం ఉన్నపుడు మళ్ళీ పార్టీలో కనబడటం ఏమిటంటు వ్యతిరేకవర్గం ఎంపీని నిలదీస్తోంది. అయినా చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండానే ఇపుడు ఎంపీకి బాధ్యతలు అప్పగించారు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.