తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటీఎస్ వసూళ్ల పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని అన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంటూ ప్రకటనలతో జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని వ్యాఖ్యానించారు. “జూనియర్ కిమ్ మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారు“ అని నిప్పులు చెరిగారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
ధరల నియంత్రణలో జగన్ విఫలమయ్యారని, రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పుల మయం చేశారని, పుట్టే ప్రతి బిడ్డ పైనా అప్పు చేస్తున్నారని అన్నారు. ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించడంతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. “పంచాయతీల నిధులు దారి మళ్లించారు.. జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం నమ్మే పరిస్థితి లేదు. ప్రభుత్వ భూములు అమ్మడమనేది డిజిన్వెస్ట్ మెంట్ విధానంలో భాగం కాదని, బిల్డ్ ఏపీ కేసులో ఇంప్లీడ్ కాలేమని కేంద్రం తేల్చి చెప్పడం జగన్‌కి చెంప పెట్టు“ అని చంద్రబాబు అన్నారు.
సంక్షేమం పేరుతో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. “ఇచ్చేది గోరంత-దోచుకునేది కొండంత“ అని చెప్పారు. సంక్రాంతి పండుగను రైతులు ఆనందంగా జరుపుకోలేని పరిస్థితి వచ్చిందని, వచ్చిన పరిశ్రమలను కూడా తరిమేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ మేధావులకు, పేటీఎం బ్యాచ్ లకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడికి పాల్పడడం గర్హనీయమన్నారు.
“రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడటం హేయం“ అన్నారు. సీఎం జగన్ తీరుతో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారు. ఆర్టీసీ భవిష్య నిధి రూ.1600 కోట్లను కూడా దారి మళ్లించడం పాలనా వైఫల్యానికి నిదర్శనం.జల్లేరు వాగులో బస్సు బోల్తా ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత. బస్సు గేర్ బాక్స్ మార్చడానికి కూడా జగన్ వద్ద డబ్బులు లేవా అని ప్రశ్నించారు. విశాఖ రామానంద ఆశ్రమంలో గోవులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పశువులకు గడ్డిపెట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా? అని నిలదీశారు. జగన్ సొంత బాబాయి అయిన వివేకాహత్య కేసును కుట్రలతో దారి మళ్లిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates