మందు బాబులకు గుడ్ న్యూస్

ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మ‌ద్య నిషేధం అంటూనే.. మ‌రోసారి.. మందు బాబుల‌కు మ‌రింత కిక్కు ఇచ్చే నిర్ణ‌యం తీసుకుంది. మ‌ద్యం ప్రియులు ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్న ప్ర‌ముఖ బ్రాండ్ల మ‌ద్యాన్ని వ‌చ్చే వారం నుంచి తీసుకురానున్నారు. దీంతో ఇంపీరియ‌ల్ బ్లూ, మెక్‌డోల్ విస్కీ, బ్రాందీ, రాయ‌ల్ స్టాగ్‌ స‌హా అనేక ప్ర‌ముఖ బ్రాండ్లు ప్ర‌భుత్వ‌ రిటైల్ దుకాణాల్లోకి వ‌చ్చేస్తాయి. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

మద్యం పన్ను రేట్లలో మరోసారి మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యాట్, ఎక్సైజ్‌ డ్యూటీ స్పెషల్‌ మార్జిన్‌లో హేతుబద్ధత తీసుకువచ్చింది. పన్నుల హేతుబద్ధత ద్వారా మద్యం ధరలు తగ్గుతాయని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు ఇచ్చారు. ప్ర‌స్తుతం రూ.200 అమ్ముతున్న బ్రాండ్ ఇక‌పై 150కి విక్ర‌యిస్తారు. అదేవిధంగా ఇతర బ్రాండ్ల ధ‌ర‌లు కూడా భారీగా త‌గ్గ‌నున్నాయి.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వెరైటీలపై 5-12 శాతం ధర తగ్గే అవకాశం ఉంది. ఇతర అన్ని కేటగిరీలపై 20 శాతం వరకు ధరలు తగ్గుతాయి. అక్రమ మద్యం, నాటుసారా తయారీ అరికట్టేందుకే ధరల తగ్గింపు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చింది. వచ్చే వారం నుంచి ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయాలు జరుగుతాయని.. దీనివ‌ల్ల‌.. పొరుగు రాస్ట్రాల నుంచి అక్ర‌మ ర‌వాణా త‌గ్గిపోతుంద‌ని తెలిపింది.

ఇదిలావుంటే.. మ‌ద్య నిషేధం అంటూనే ఇలా.. నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్న‌ప్ప‌టికీ నిషేధంపై.. ఎలాంటి ఊసు లేక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో దీనిపైనా ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చింది. తాము తీసుకుంటున్న  చర్యల వల్ల రాష్ట్రంలో 37 శాతం వినియోగం తగ్గిందని పేర్కొంది. అయితే.. తాజాగా తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించుకుంటూ.. అక్రమ రవాణా అరికట్టేందుకే మద్యం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామ‌ని పేర్కొంది. ఇక‌, మందు బాబుల‌కు పండ‌గే పండ‌గ‌.!!