బీజేపీకి షాక్‌.. మెట్రోమ్యాన్ గుడ్‌బై

వ‌రుస‌గా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన మోడీ ప్ర‌భుత్వానికి ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని టాక్‌. కేంద్ర స‌ర్కారు వైఫ‌ల్యాల‌పై ప్ర‌జ‌లు మండిప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో జ‌నాల వ్య‌తిరేక‌త త‌గ్గించుకునేందుకు మోడీ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అందులో భాగంగానే మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేశారు. డీజీల్‌, పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని త‌గ్గించారు. అయిన‌ప్ప‌టికీ ఏ మూలనో భ‌యం మాత్రం పోలేద‌ని నిపుణులు చెబుతున్నారు. దీంతో వ‌చ్చే ఏడాది అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌పై బీజేపీ ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఈ నేప‌థ్యంలో కేర‌ళ‌లో ఆ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది.

కేర‌ళ‌పై ప‌ట్టు కోసం బీజేపీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం మాత్రం రావ‌ట్లేదు. ఈ ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్నో స‌వాళ్ల మ‌ధ్య బ‌రిలోకి దిగిన బీజేపీ ఒక్క సీటు కూడా గెల్చుకోలేక‌పోయింది. ఇక తాజాగా అక్క‌డ పార్టీకి మ‌రో గ‌ట్టిదెబ్బ త‌గిలింది. మెట్రోమ్యాన్ శ్రీధ‌ర‌న్ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ సీఎం అభ్య‌ర్థిగా శ్రీధ‌ర‌న్‌ను బీజేపీ బ‌రిలో దించింది. రాజకీయాల్లో ఏ మాత్రం అనుభ‌వం లేని ఆయ‌న‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. కానీ ఎన్నిక‌ల్లో భారీ షాక్ తప్ప‌లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీధ‌ర‌న్ కూడా ఓడిపోయారు. దీంతో అక్క‌డ బీజేపీలో నైరాశ్యం నెల‌కొంది.

ఇప్పుడేమో ఇక‌పై క్రియాశీల రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేద‌ని 90 ఏళ్ల శ్రీధ‌ర‌న్ పేర్కొని బీజేపీకి షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాల‌క్కాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆయ‌న తాను రాజ‌కీయాల్లో ఉండే స‌మ‌యం గ‌డిచిపోయింద‌ని అన్నారు. తాను రాజ‌కీయాల‌ను వ‌దులుకోలేదని కానీ ఇక‌పై వాటి చుట్టూ తిర‌గ‌డంపై ఆస‌క్తి పోయింద‌ని ఇప్పుడు త‌న వ‌య‌సు 90 ఏళ్ల‌ని ఆయ‌న పేర్కొన్నారు.

తానెప్పుడూ రాజ‌కీయ నాయ‌కుడిని కాద‌ని బ్యూరోక్రాట్‌గా రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని వాటికి అతీతంగా మూడు ట్ర‌స్టుల ద్వారా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నాన‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన‌ప్పుడు నిరాశ చెందాన‌ని కానీ ఇప్పుడు ఫీలింగ్ లేద‌ని చెప్పారు. ఎందుకంటే ఒక్క‌డినే ఎమ్మెల్యేగా గెలిచినా ఏమీ చేయ‌లేక‌పోయేవాణ్ని అని తెలిపారు.