ఓడిన చోటుకు రెండేళ్ల త‌ర్వాత రాహుల్‌

Rahul Gandhi

నెహ్రూ హ‌యాం నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉన్న ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ హస్త‌గ‌తం చేసుకుంది. కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడికి షాకిస్తూ సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. ఆ ఓట‌మి త‌ర్వాత ఆ నేత మ‌ళ్లీ అక్క‌డికి వెళ్ల‌లేదు. కానీ పోయిన చోటే వెతుక్కోవాల‌ని అన్న‌ట్లు ఇప్పుడు రెండేళ్ల త‌ర్వాత అక్క‌డ అడుగు పెట్ట‌బోతున్నారు. ఆ నాయ‌కుడు.. రాహుల్ గాంధీ. ఆ నియోజ‌క‌వ‌ర్గం అమేథీ. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి స్మృతి ఇరానీ చేతిలో అక్క‌డ రాహుల్ ఘోర ప‌రాజ‌యం చెందారు.

కానీ ముందు జాగ్ర‌త్త‌గా కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి పోటీ చేసి అక్క‌డ గెల‌వ‌డంతో ఎంపీగా కొన‌సాగుతున్నారు. ఆ ఓట‌మి త‌ర్వాత యూపీలోని అమేథీలో అడుగుపెట్ట‌ని ఆయ‌న‌.. ఇప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం అక్క‌డికి వెళ్ల‌నున్నారు. ద‌శాబ్దాల నుంచి యూపీలో కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉన్న అమేథీలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ వ‌రుస‌గా రెండు సార్లు గెలిచారు.

కానీ రెండేళ్ల క్రితం మాత్రం బీజేపీ గాలికి ఎదురు నిల‌బ‌డ‌లేక అనూహ్యంగా ఓట‌మి పాల‌య్యారు. అప్ప‌టి నుంచి ఆయ‌న అమేథీకి వెళ్ల‌లేదు. కానీ వ‌చ్చే ఏడాది యూపీ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న ఈ నెల 18న అక్క‌డికి వెళ్లి బీజేపీ పాల‌న‌కు వ్య‌తిరేకంగా పాద‌యాత్ర చేయ‌నున్నారు. అక్క‌డి నుంచే యూపీ ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించ‌నున్నారు. మ‌రోసారి కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా రాహుల్ గాంధీ పేరే ఖ‌రారైంద‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో ఆయ‌న అమేథీ వెళ్ల‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇప్ప‌టికే యూపీలో తిరిగి కాంగ్రెస్ జెండా పాతాల‌నే ల‌క్ష్యంతో రాహుల్ సోద‌రి ప్రియాంక అక్క‌డ ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ఇప్పుడు రాహుల్ పాద‌యాత్ర‌లో ఆమె కూడా పాల్గొంటార‌ని తెలిసింది. మ‌రోవైపు యూపీలో రాజ‌కీయ వేడి ర‌గులుతోంది. అధికారం నిల‌బెట్టుకోవ‌డం కోసం బీజేపీ వ్యూహాలు ర‌చిస్తోంది. మ‌రోవైపు ఇత‌ర పార్టీల‌తో పొత్తులు పెట్టుకుంటూ.. వేరే పార్టీల ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకుంటూ స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ జోరుమీదున్నారు. తిరిగి రాష్ట్రంలో ప‌ట్టు ద‌క్కించుకోవాల‌ని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఒంట‌రిగానే పోరుకు సిద్ధ‌మైన కాంగ్రెస్ అక్క‌డ బీజేపీకి చెక్ పెడుతుందా అన్న‌ది చూడాలి.