దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీని జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీ, సీపీఎస్ రద్దు తదితర విషయాలపై జగన్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయి పీఆర్సీని అమలు చేయలేని పక్షంలో ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తుంది. ప్రభుత్వం ఇపుడు అమలు చేయాల్సిన పీఆర్సీ 2018, జూలై నుండి పెండింగ్ లో ఉంది.
సరే ప్రస్తుత విషయానికి వస్తే పీఆర్సీ ఎంత ఫిట్మెంట్ ఫిక్స్ చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత పడుతుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చే జరిగింది. ఉన్నతాధికారులు రకరకాలుగా కాలిక్యులేషన్లు వేసి లెక్కలు సీఎంకు చూపారని సమాచారం. ఉద్యోగ సంఘాలు మాత్రం 50 శాతం ఫిట్ మెంట్ డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాల ప్రకారం ఫైనల్ ఫిట్మెంట్ 30-35 శాతం మధ్య ఫిక్సయ్యే అవకాశం ఉందని చెప్పాయి.
ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. ఎంత వివరించినా, ఎంత కసరత్తు చేసినా ఫైనల్ గా పీఆర్సీ అయితే అమలు చేయక తప్పదు. పీఆర్సీ అమలును వాయిదా వేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని జగన్ గ్రహించాలి. పీఆర్సీ అమలును ఎంత వాయిదా వేస్తే ప్రభుత్వానికి అంత నష్టం తప్పదు. ఈనెల 7వ తేదీ నుంచి మొదలైన ఉద్యోగ సంఘాల సమ్మె ఇందులో భాగమనే చెప్పాలి. ఏదో పద్దతిలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఫిట్మెంట్ ను ఫైనల్ చేసుకోవటమే మంచిది.
జగన్ సమక్షంలో జరిగిన సుదీర్ఘ చర్చల కారణంగా ఒకటి, రెండు రోజుల్లో ఉద్యోగసంఘాల నేతలతో ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు సమావేశం జరపనున్నారు. జగన్ సమక్షంలో జరిగిన రివ్యూ అంశాలను ఫిట్మెంట్ వివరాలను నేతలకు ఉన్నతాధికారులు వివరించబోతున్నారట. ఈ సమావేశంలో రెండు వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫైనల్ గా సీఎంతో నేతలు భేటీ రెడీ అవుతుంది. వాళ్ళ సమక్షంలోనే సీఎం ఫిట్మెంట్ ఎంతన్నది ప్రకటిస్తారని తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates