రేవంత్ జోస్యం నిజ‌మైందా..?

ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్‌పై రేవంత్‌రెడ్డి చెప్పిన జోస్య‌మే నిజ‌మైందా.. మోడీతో ఆ పార్టీ ఎంపీలు కుమ్మ‌క్క‌య్యారన్న ఆరోప‌ణ వాస్త‌వ‌మేనా..? అన్నఅనుమానాలు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో నెల‌కొన్నాయి. టీఆర్ఎస్ ఎంపీలు ఇక‌పై కేంద్రంతో ఎలా పోరాడ‌తారు..? రాష్ట్రంలో రైతుల మ‌ద్ద‌తు ఎలా కూడ‌గ‌డుతారు..? లేదా రేవంత్ రెడ్డి మాట‌ల‌ను నిజం చేస్తారా..? అని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు స‌మ‌స్య‌పై పార్ల‌మెంటులో టీఆర్ఎస్ ధ‌ర్నాలు చేసింది నిన్న‌టి వ‌ర‌కు.

ఈరోజు నుంచి కేంద్రం వైఖ‌రికి వ్య‌తిరేకంగా స‌భ నుంచి వాకౌట్ చేస్తున్నామ‌ని.. ఇక‌పై పార్ల‌మెంటులో అడుగుపెట్ట‌బోమ‌ని ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు వెల్ల‌డించారు. కేంద్రం మోస‌పూరిత వైఖ‌రిని రాష్ట్రంలో ఎండ‌గుడుతామ‌ని.. రాష్ట్రం మొత్తం తిరిగి ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేస్తామ‌ని.. అగ్గి రాజేసి బీజేపీని కార్న‌ర్ చేస్తామ‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు, ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోప‌ణ మ‌రోలా ఉంది. టీఆర్ఎస్ డ్రామా ముగిసింద‌ని.. బీజేపీతో లాలూచీ ప‌డింద‌ని.. ఆ పార్టీ ఎంపీలంతా నేడే బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌ని రేవంత్ నిన్న‌నే ఆరోప‌ణ చేశారు.

పార్ల‌మెంటులో ఆ పార్టీ నిర‌స‌న చేయ‌వ‌ద్ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం నుంచి కేసీఆర్ కు ఆదేశాలు వెళ్లాయ‌ని. ఎంపీలంద‌రూ వెంట‌నే హైద‌రాబాద్‌కు వ‌చ్చేయాల‌ని కేసీఆర్ ఆదేశించార‌ని.. రేవంత్ ఆరోపించారు. దానికి త‌గిన‌ట్లుగానే టీఆర్ఎస్ ఎంపీలు న‌డుచుకున్నార‌ని.. స‌భ నుంచి వాకౌట్ చేయ‌డంతో వారి వైఖ‌రి తేట‌తెల్లం అయింద‌ని.. మిగ‌తా ఎంపీలు గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఈ అంశంపై రేవంత్ చేసిన మ‌రొక ఆరోప‌ణ టీఆర్ఎస్‌ను గంద‌ర‌గోళంలో ప‌డేసేలా ఉంది. ఆ పార్టీ ఎంపీలు పార్ల‌మెంటును బ‌హిష్క‌రించ‌డం వెనుక బీజేపీతో ర‌హ‌స్య ఒప్పందం ఉంద‌ని తెలిపారు.

ఒక భూ కుంభ‌కోణంలో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని గుర్తించిన ఆ పార్టీ ఎంపీలు మోడీతో డీల్ కుదుర్చుకున్నార‌ని.. దీని వెనుక 3 వేల కోట్ల స్కాం ఉంద‌ని.. రేవంత్ బాంబు పేల్చారు. దీంతో టీఆర్ఎస్ నేత‌లు కౌంట‌ర్ అటాక్‌కు దిగారు. రేవంత్‌వి పిచ్చి ప్రేలాప‌న‌లు అని దమ్ముంటే నిరూపించాల‌ని స‌వాల్ విసిరారు. ఈ అంశంలో నిజానిజాలు తేలుతాయా..? రేవంత్ ముందు ముందు ఎలాంటి అడుగులు వేయ‌నున్నారు..? ఇది ఒక ఆరోప‌ణ‌గానే మిగిలిపోతుందా..? అనేది వేచి చూడాలి.