ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసుల్లో సీఎం జగన్ విచారణ ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన జగన్ బెయిల్ పై బయట ఉన్నారని, సీఎం హోదాలో ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు కొట్టవేసింది. ఇక, ప్రతి శుక్రవారం కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలన్న జగన్ పిటిషన్ విచారణ కూడా కోర్టులో చాలాకాలంగా పెండింగ్ లో ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా నేడు జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఎం హోదాలో జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని, అందుకే ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని హైకోర్టును సీబీఐ తరఫు న్యాయవాదులు కోరారు. జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని వాదించారు. పదేళ్లయినా ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయని తెలిపారు.
హాజరు మినహాయింపు ఇస్తే విచారణలో మరింత జాప్యం జరుగుతుందని హైకోర్టుకు సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది సురేంద్ర తెలిపారు. గతంలో కూడా ఇదే తరహాలో జగన్ చేసిన ఇదే అభ్యర్థనను కోర్టులు తోసిపుచ్చాయని వెల్లడించారు. అయితే, సీఎం హాదాలో ఉన్న జగన్ బిజీగా ఉంటారని, కాబట్టి ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని జగన్ తరఫు న్యాయవాదులు కోరు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు…తీర్పును రిజర్వ్ చేసింది.