ఫైర్ బ్రాండ్ గా పాపులరైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫుల్లు హ్యాపీ అయిపోతారేమో. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ రూపంలో గట్టి మద్దతుదారు దొరికారు కాబట్టే. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని మమత ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికైతే మమత ప్రయత్నాలకు ఇతరుల నుంచి పెద్దగా సానుకూలత రాలేదన్నది వాస్తవం.
ఒకటి రెండు సార్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో మమత భేటీలు జరుపుతున్న మమత నేతృత్వంలో ఏర్పడే కూటమిలో చేరటానికి రెడీ అంటు పవార్ ఇప్పటివరకు డైరెక్టుగా ప్రకటించలేదు. పవార్ దృష్టంతా తొందరలోనే జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలపైనే ఉందనంటున్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రపతిగా పవార్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే.
ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఏడాదిలో జరగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్-అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీలు పొత్తు పెట్టుకోవటానికి రెడీ అవుతున్నాయి. ఝాన్సీ లో జరిగిన ఓ ర్యాలీలో అఖిలేష్ మాట్లాడుతూ యూపీలోకి దీదీకి స్వాగతం పలికారు. అలాగే మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తొందరలోనే ఏర్పాటవబోయే కూటమిలో చేరటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఇప్పటివరకు మమత చాలా పార్టీల అధినేతలను కలిసినా ఎవరు కూడా అఖిలేష్ లాగా బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. అఖిలేష్ బహిరంగ మద్దతు ప్రకటించటమంటే మామూలు విషయం కాదు. అఖిలేష్ రూపంలో బలమైన మద్దతుదారుడు దొరికినట్లే అనుకోవాలి. రేపటి యూపీ ఎన్నికల్లో గనుక సమాజ్ వాదీ పార్టీ గనుక అధికారంలోకి వచ్చేస్తే మమత ఫుల్లు హ్యాపీగా ఫీలవుతారేమో. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలోని అధికార పార్టీ మమతకు మద్దతుగా నిలబడటం అంటే చిన్న విషయం కాదు.
ఒకవేళ అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఎస్పీ చాలా బలమైన పార్టీ అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ రూపంలో అయినా మమతకు గట్టి మద్దతుదారుడు దొరికినట్లే. కాబట్టే మమత ఫుల్లు హ్యాపీ అయినట్లే అనుకోవాలి. ఎస్పీ లాంటి పార్టీలు మరో రెండు కనుక మమతకు మద్దతుగా నిలబడితే అప్పుడు చూడాలి నరేంద్ర మోడీ రాజకీయం ఎలాగుంటుందో.