కేసీఆర్ యూ ట‌ర్న్‌?

ఏది ఏమైనా తాను అనుకున్న‌ది చేసి తీర‌తాడ‌ని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పేరుంది. ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఆరోప‌ణ‌లు వ‌చ్చినా ఆయ‌న మాత్రం తాను త‌ల‌పెట్టిన కార్యాన్ని పూర్తి చేసే తీర‌తారు. అది పార్టీ ప‌రంగా కావొచ్చు లేదా ప్ర‌భుత్వ విధానాల ప‌రంగా కావొచ్చు. ఆయ‌న ఏ విష‌యంలోనూ వెన‌క‌డ‌గు వేసింది లేద‌ని విశ్లేష‌కులు చెప్తారు. కానీ ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ వెన‌క్కి త‌గ్గ‌నున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కొన్ని నిర్ణ‌యాల్లో ఆయ‌న మ‌రోసారి ఆలోచించి ముంద‌డుగు వేసే అవ‌కాశం ఉంద‌నే టాక్ న‌డుస్తోంది.

రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను క్షేత్ర‌స్థాయి నుంచి బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే గ్రామ స్థాయి క‌మిటీ నుంచి రాష్ట్ర స్థాయి క‌మిటీ వ‌ర‌కూ పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై క‌స‌ర‌త్తు మొద‌లెట్టి పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా పార్టీకి అధ్య‌క్షుల‌ను కూడా నియ‌మించాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే దాదాపు అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి నుంచి మొద‌లుకుని మండ‌ల స్థాయి వ‌ర‌కూ క‌మిటీలు ఏర్పాటు అయిన‌ట్లు స‌మాచారం. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట‌మి, వ‌రి కోనుగోళ్ల విష‌యంలో ఆందోళ‌న‌, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ ప్ర‌క్రియ ఆల‌స్య‌మ‌వుతోంది.

అయితే జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మించాల‌నే నిర్ణ‌యాన్ని కేసీఆర్ వెన‌క్కి తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం మొద‌లైంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు త‌ర్వాత చాలా జిల్లాల్లో రెండు మూడు నియోజ‌క‌వ‌ర్గాల కంటే ఎక్కువ‌గా లేవు. దీంతో జిల్లాలోని ఎమ్మెల్యేల్లో ఒక‌రిని జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఎంపిక చేస్తే మిగ‌తా ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తి వ్య‌క్త‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని పార్టీ నాయ‌క‌త్వం భావిస్తోంద‌ని స‌మాచారం.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ ఎమ్మెల్యేలు మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా పెత్త‌నం చేసే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ కూడా సాగుతోంది. ఒక‌వేళ ఎమ్మెల్యే కానీ నాయ‌కుణ్ని అధ్య‌క్షుడిగా చేస్తే ఆయ‌న మాట‌ల‌ను ఎమ్మెల్యేలు వింటారా అన్న‌ది కూడా సందేహ‌మే. పైగా ఆ నాయ‌కుడు ఏదో  ఒక నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టి అక్క‌డి నుంచి టికెట్ కోసం ప్ర‌య‌త్నిస్తే అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు ఇబ్బందిగా మారుతుంది. ఈ అంశాల‌న్నింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న కేసీఆర్ ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటార‌ని తెలుస్తోంది.

టీఆర్ఎస్ 20వ వార్షికోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా విజ‌య గ‌ర్జ‌న పేరుతో పార్టీ భారీ బహిరంగ స‌భ నిర్వ‌హించాల‌నుకుంది. గ‌త నెల‌లోనే ఇది జ‌ర‌గాల్సింది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మితో పాటు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావ‌డంతో ఈ స‌భ వాయిదా వేశారు. కానీ ఆ వాయిదా వేసిన స‌భ‌ను ఇప్ప‌ట్లో నిర్వ‌హించే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేద‌నే చెప్పాలి. ఎందుకంటే ఈ నెల 16తో ఎన్నిక‌ల కోడ్ ముగుస్తుంది. కానీ స‌భ నిర్వ‌హ‌ణ దిశ‌గా పార్టీ నుంచి ఎలాంటి చ‌ప్పుడు లేదు. ముందుగా పార్టీ సంస్థాగ‌త నిర్మాణంతో పాటు పార్టీలోని అసంతృప్త నేత‌ల‌కు వివిధ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డంపై కేసీఆర్ దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌క్రియ అంతా పూర్త‌యిన త‌ర్వాత వ‌చ్చే ఏడాది ఏప్రిల్లో ఈ విజ‌య గ‌ర్జ‌న స‌భ‌ను నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం.