ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరద ఉధృతికి కడపలోని అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడం, ఆ వరద నీటి ప్రభావానికి 62 మండి మరణించడం పెను దుమారం రేపింది. గ్రీజు పెట్టకపోవడం వల్లే గేట్ సకాలంలో తెరుచుకోలేదని, అందుకే ఈ ప్రమాదం జరిగిందన్న ఆరోపణలతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఘటనపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు.
గేటుకు గ్రీజు కూడా పెట్టలేని సీఎం…3 రాజధానులు ఏం నిర్మిస్తారు అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. గతంలో ఆ ప్రాజెక్టుకు వరదలు వచ్చిన సందర్భంలో గేట్లు తెరిచి ఉంచేవారని, కాబట్టి వరద నీరు వృథాగా పోయి ప్రాణనష్టం జరిగేది కాదని గుర్తు చేశారు..గేట్ ఓపెన్ కాలేదని వైసీపీ నేతలు చేతులు దులుపుకుంటున్నారని, ఆ గేట్ సమస్య చాలాకాలం నుంచి ఉన్నా పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
అంతేకాదు, ఇసుక కోసం నదిలోకి వెళ్లిన టిప్పర్లను రక్షించేందుకు నీటిని దిగువకు విడుల చేయలేదని, వరద హెచ్చరికలున్నా సకాలంలో జగన్ స్పందించలేదని ఆరోపించారు. తెలిసో తెలియకో ఓట్లేసిన పాపానికి ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ప్రాణ నష్టం జరిగిందని, రూ. 6 వేల కోట్ల పంట, ఆస్తి నష్టం సంభవించిందని ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates