ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా, తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యోగ సంఘాలు పోరుబాటపట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. 11వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయకపోవడంతోనే ఈ నెల 7 నుంచి తాము నిరసనలకు దిగబోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నిరసన ప్రకటన నేపథ్యంలో ఈ రోజు వారితో సీఎంవో అధికారులు చర్చలు జరుపుతున్నారు.
ఈ క్రమంలోనే తిరుపతిలో పర్యటిస్తున్న జగన్ ను ఉద్యోగుల తరఫున కొందరు ప్రతినిధులు కలిసి మాట్లాడారు. పీఆర్సీపై ప్రకటన చేయాలని వారు జగన్‌ను కోరారు. దీంతో, ఈ వ్యవహారంపై స్పందించిన జగన్… ఏపీ ఉద్యోగులకు జగన్ తీపి కబురు చెప్పారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, మరో 10 రోజుల్లో ఉద్యోగులకు శుభవార్త చెబుతూ అధికారిక ప్రకటన చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
వాస్తవానికి చాలా రోజుల నుంచి ఉద్యోగులు తమ సమస్యలపై జగన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా…ఫలితం లేదు. దానికితోడు, పీఆర్సీ నివేదికను కూడా ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో, అసహనానికి గురైన వారు ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. దీంతో హుటాహుటిన ఈ రోజు సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో కార్యదర్శుల కమిటీ చర్చించి సమస్యను ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఈ సమావేశంలో పీఆర్సీపై తక్షణం ప్రభుత్వం ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుపట్టారని తెలుస్తోంది. దీంతోపాటు, సీపీఎస్ రద్దు, జీతాల చెల్లింపులు, డీఏ బకాయిలు వంటి పలు సమస్యలపై గళం విప్పారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ తిరుపతిలో ప్రకటన చేశారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఉద్యమ కార్యచరణ ప్రకటించిన తర్వాత ప్రభుత్వంలో స్పందన వచ్చిందని ఉద్యోగులు అనుకుంటున్నారు.