ప్లీజ్‌.. కొంచెం ఎక్కువ ఇచ్చేట్లు చూడండి.. కేంద్ర బృందానికి సీఎం జగన్ విన‌తి

“ప్లీజ్ మీరే స్వ‌యంగా చూశారు. ఆ నాలుగు జిల్లాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయ్‌. కేంద్రంతో చెప్పి.. మ‌రికొంత ఎక్కువ మొత్తం ఇప్పించేలా చూడండి!!“ ఇదీ.. కేంద్రం నుంచి వ‌చ్చి.. వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన బృందానికి తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్ చేసిన విజ్ఞ‌ప్తి. మొత్తంగా మూడు రోజుల పాటు.. వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన ఈ బృందం క్షేత్ర‌స్థాయిలో న‌ష్టాన్ని ప‌రిశీలించింది.  ఈ క్ర‌మంలో తాజాగా ముఖ్య మంత్రితో భేటీ అయింది. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌.. ఈ బృందానికి కొన్ని విజ్ఞ‌ప్తులు చేశారు. ఇప్ప‌టికే తాము త‌క్ష‌ణ సాయంగా 1000 కోట్లు ఇవ్వాల‌ని అభ్య‌ర్థించామ‌ని.. తెలిపారు.

సో.. ఇప్పుడు మీరు కూడా స్వ‌యంగా చూశారు కాబ‌ట్టి.. మ‌రికొంత ఎక్కువ‌గానే ప‌రిహారం ఇప్పించండి.. అని జ‌గ‌న్ ఈ బృందాన్ని కోరారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర బృందంలోని స‌భ్యులు మాట్లాడుతూ.. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసించారు. “– కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లింది.  పశువులు చనిపోయాయి, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు వంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి. మీ నాయకత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయం.  అంకిత భావంతో పనిచేసే అధికారులు మీకు ఉన్నారు.  వీరంతా మాకు మంచి సహకారాన్ని అందించారు. యువకులు, డైనమిక్‌గా పనిచేసే అధికారులు ఉన్నారు. “ అని పేర్కొన్నారు.

విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారని కేంద్ర బృందం పేర్కొంది. ప్రతి ఒక్కరూ కూడా వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారని తెలిపారు. ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యాంలు కూడా ఈ ప్రాంతంలో లేవన్న బృందం.. ఉన్న డ్యాంలు, రిజర్వాయర్లు కూడా ఈ స్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావని తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్టు నుంచి వెళ్లే తాగునీటి సరఫరా వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు.  ఇరిగేషన్‌కూ తీవ్ర నష్టం ఏర్పడిందని, బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయ‌ని తెలిపారు. మొత్తంగా అత్యవసర సర్వీసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు చాలా బాగా పనిచేశారని కితాబు నిచ్చారు.

ఇదిలావుంటే.. సీఎం మాత్రం న‌ష్టాన్ని త్వ‌ర‌గా.. ఎక్కువ‌గా ఇప్పించాల‌ని కోరారు. ఉదారంగా, మానవతా పరంగా స్పందించాలని కోరుతున్నాన‌న్నారు. తాము పంపించిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదన్నారు.  న‌ష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో మాకు సమర్థవంతమైన వ్యవస్థఉందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉందని తెలిపారు.  ఇ– క్రాప్‌కు సంబంధించి రశీదుకూడా రైతుకు ఇచ్చామ‌ని చెప్పారు. నష్టంపోయిన పంటలకు సంబంధించి కచ్చితమైన, నిర్దారించబడ్డ లెక్కలు ఉన్నాయన్నారు. వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని న‌ష్టం ఇప్పించాల‌ని విన్న‌వించారు.