ఏపీ ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వలేక పోతున్నారు. ఆదిలో 1-5 మధ్య ఇచ్చిన వేతనాలు.. తర్వాత 1-10కు చేరాయి. ఇప్పుడు.. మూడు మాసాలుగా 1-20 లోపు అంటే.. ప్రతి నెలా ఒకటి నుంచి 20 వ తేదీలోపు ఎప్పుడు వీలుంటే అప్పుడు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులు పండగలు చేసుకోలేక.. ఇళ్లలో ఫంక్షన్లు చేసుకోలేక.. లబోదిబో మంటున్నారు.. మరోవైపు.. అన్ని ధరలు మండిపోతున్నాయి. దీంతో చేతిలో ఉన్న డబ్బులు ఖర్చయిపోయి.. ప్రభుత్వం ఎప్పుడు వేతనాలు ఇస్తుందా? అని ఎదురు చూసే పరిస్థితి వస్తోంది.
ఇక, ఈ పరిస్థితి నుంచి త్వరలోనే గట్టెక్కుతామని.. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోగా.. `అసలు ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాం కదా!“ అని.. ఏకంగా.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. సో.. దీనిని బట్టి.. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడమే ఎక్కువ అనేధోరణిలో వైసీపీ ప్రభుత్వం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి(సీఎం ఆఫీసులో పని చేసే వారికి కూడా… ఇంకా చెప్పాలి అంటే సీఎం పిఆర్వోలకు కూడా) 5 నెలలుగా జీతాలు లేవు. దీంతో వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వారు కూడా సర్కారుపై ఉద్యమానికి రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు.. ఒక వ్యూహం ప్రకారం.. అడుగులు వేసి ప్రభుత్వ వైఖరిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ఖజానా పరిస్థితి దారుణంగా ఉంది కదా.. అందుకే.. తమకు వేతనాలు ఆలస్యం చేస్తున్నామని.. ప్రభుత్వం చెబుతోంది కదా.. మరి.. సలహాదారుల పరిస్థితి ఏమిటి? దాదాపు 67 మందికి పైగా ఉన్న వారికి ప్రభుత్వం వేతనాలను ఏ సమయంలో ఇస్తోదనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అదేసమయంలో ప్రజాప్రతినిధుల వేతనాల చెల్లింపు ఎలా ఉంది? అనే విషయాన్ని కూపీలాగారు. దీని ప్రకారం… రాజ్యాంగ బద్ధమైన అసెంబ్లీ సభ్యులకు వేతనాలను ప్రతి నెల 1 నే చెల్లిస్తున్నారని తెలిసింది. అయితే.. వారికి ఇస్తున్న భత్యాలను మాత్రం ఓ నాలుగు రోజులు ఆలస్యంగా ఇస్తున్నారట.
ఇక, సలహాదారుల విషయానికి వస్తే.. వారు ఏపీలో ఉన్నా లేకున్నా.. ఎలాంటి సలహాలు ఇస్తున్నా.. ఇవ్వకున్నా.. ఠంచనుగా.. వారికి నెల తిరిగే పాటికి 1నే వేతనాలు.. భత్యాలు ఇస్తున్నారని.. ఉద్యోగులు గ్రహించారు. అదేమంటే.. సీఎం జగన్ ఏరికోరి తెచ్చుకున్నారు కనుక వారిని అగౌరవపరుస్తామా? అంటూ.. కొందరు పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారట. ప్రస్తుతం తమ హక్కులపై.. రోడ్డెక్కేందుకు రెడీ అవుతున్న.. ఉద్యోగులు మరి ఈ విషయాన్ని కూడా పాయింట్ ఔట్ చేస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి పనిచేసే వారికి.. తర్వాత.. సలహాలు ఇచ్చేవారికి ముందు.. అన్నట్టుగా ఉంది పరిస్థితి.