పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల దగ్గర ప్రధానమంత్రి నరేంద్రమోడి గట్టిగా తగులుకున్నట్లే ఉన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను మడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన సరిపోదని దానికి అనుబంధంగా ఉన్న మరికొన్ని చట్టాలను రద్దు చేయటంతో పాటు కొన్ని చట్టాలను చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) గట్టిగా పట్టుబడుతోంది. ఎలాగు తొందరలోనే ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి కదా అందుకనే ప్రతిపక్షాలన్నీ బీకేయూకి గట్టి మద్దతుగా మారాయి.
బీకేయూ పట్టుబడుతున్న చట్టాల రద్దులో వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు కీలకమైనది. అలాగే చేయాల్సిన చట్టంలో పంటలకు కనీస మద్దతు ధర ముఖ్యమైనది. ఇప్పటివరకు కనీసస మద్దతు ధర అన్నది ప్రభుత్వం నిర్ణయంమీదుంది. అవసరానికి ఎప్పటికప్పుడు కేంద్రం పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటిస్తోంది. అలా కాకుండా కనీస మద్దతు ధరను చట్టం రూపంలోకి తీసుకొస్తే ఇకనుండి కేంద్రం దయపైన ఆధారపడక్కర్లేదన్నది బీకేయూ వాదన.
ఇక వీటితో పాటు వ్యవసాయానికి సంబంధించిన చిన్న చిన్న డిమాండ్లు ఎలాగు ఉన్నాయి. బీకేయూ డిమాండ్లకు తోడు కొన్ని ప్రాంతీయపార్టీల డిమాండ్లు ఎలాగూ ఉన్నాయి. తెలంగాణానే తీసుకుంటే బాయిల్డ్ రైస్ ను కేంద్రం కొని తీరాలంటు కేసీయార్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని, రచ్చ చేయాలని తన ఎంపీలకు కేసీయార్ స్పష్టంగా చెప్పారు. కేసీయార్ ఆదేశాల ప్రకారం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో గోల చేయటం ఖాయం.
ఇదే సమయంలో తుపానులు, భారీ వర్షాల కారణంగా అవసరమైనంత సాయం చేయలేదని తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం కేంద్రంపై మండిపోతోంది. కాబట్టి కేంద్రాన్ని నిలదీసేందుకు డీఎంకే ఎంపీలు రెడీ అయ్యారు. ఇక ఏపీ విషయానికి వస్తే ప్రత్యేకహోదా, పోలవరం నిధులు, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకమనే డిమాండ్లతో వైసీపీ ఎంపీలు కూడా గోల చేయటానికి రెడీ అవుతున్నారు. వీళ్ళందరికీ తోడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఎలాగు ఉన్నారు. తమ రాష్ట్రం ప్రయోజనాల విషయంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందంటు వాళ్ళు మండిపోతున్నారు.
దీనికి అదనంగా ఉత్తరప్రదేశ్ లో రైతులపైకి వాహనాలను నడిపి నలుగురి మరణాలకు కారకుడైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ డిమాండ్ తో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఎంపీలు గోల చేయటానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వచ్చే మార్చిలోగా యూపీలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి కాబట్టి. యూపీలో ప్రతిపక్షాలన్నీ ఇఫుడు రైతుల జపమే చేస్తున్నాయి కాబట్టి రచ్చ చేయటం ఖాయమే. మొత్తానికి ఏ విధంగా చూసినా ప్రతిపక్షాలు పార్లమెంటులో రచ్చ రచ్చ చేయటం ఖాయమని అర్ధమైపోతోంది. మరి ఈ గోలను మోడీ ఏ విధంగా ఎదుర్కొంటారన్నది ఆసక్తిగా మారింది.