వైసీపీ నేత, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. జగనన్న ఇళ్లు చిన్నవిగా ఉన్నాయని, హాల్లోనే శోభనం చేసుకోవాలని గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇక, అంతకుముందు పోలీసుల తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి ప్రసన్న కుమార్ రెడ్డి తన మార్క్ కామెంట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు.
ఈ సారి టాలీవుడ్ సినీ హీరోలు, దర్శక నిర్మాతలపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయాయని, అయినప్పటికీ సినీ హీరోలు, ప్రముఖులు స్పందించకపోవడం బాధాకరమని ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. వరద బాధితుల గురించి వారంతా కనీసం ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజల వల్లే వారంతా హీరోలుగా అయ్యారని, అటువంటి ప్రజలు కష్టాల్లో ఉంటే సాయం చేయలేదని, కనీసం ఓ ప్రకటన కూడా ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోలు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారని, కానీ, అందుకు కారణమైన ప్రజల కోసం డబ్బు ఖర్చుపెట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆపదలో సాయం చేసేవారిని జనం గుర్తు పెట్టుకుంటారని, ఇకనైనా స్పందించి తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను సినీ ప్రముఖులు ఆదుకోవాలని కోరారు.
గతంలో ఎన్టీఆర్, అక్కినేని వరద బాధితుల కోసం, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం జోలె పట్టి రోడ్డు మీదకు వచ్చి మరీ సాయం చేసేవారని ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తు చేశారు. వారిద్దరూ సినీ ఇండస్ట్రీకి రెండు కళ్లు అని ఆయన కొనియాడారు. మరి, ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates