త్వరలోనే ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని రాబట్టాలని పేర్కొన్నారు. సుమారు మూడు గంటల పాటు ఎంపీలతో భేటీ అయిన.. జగన్.. అన్ని విషయాలను వారికి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రానికి కీలకంగా ఉన్న సమస్యలపై స్పందించాలని ఆయన ఎంపీలను కోరారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల(రూ. 55,657) ఆమోదానికి కృషిచేయాలన్నారు. జాతీయ హోదా ప్రాజెక్టు కనుక అన్ని విషయాలు కేంద్రం బాధ్యత వహించాలని.. కానీ, ఎప్పుడూలేని విధంగా తాగునీటి అంశాన్ని విడదీసి చూస్తున్నారని, ప్రాజెక్ట్ పనుల్లో కాంపొనెంట్ వారీగా డబ్బులిస్తామని చెప్తున్నారని.. జగన్ తెలిపారు.
అదేసమయంలో పోలవరం విషయంలో ఇంకా ఆమోదించాల్సిన డిజైన్లు కూడా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం రూ.2,104 కోట్లు ఖర్చుపెట్టిందని, ఆ డబ్బును రాబట్టాలని ఎంపీలకు సూచించారు. అవసరమైతే.. గట్టిగా ఒత్తిడి తీసుకురావాలన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద.. లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత లేదన్న విషయాన్ని ఉభయ సభల్లో ప్రస్తావించాలన్నారు. ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,703 కోట్లు బకాయిలను తెచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
రాష్ట్ర విభజన తర్వాత మన విద్యుత్ కింద తెలంగాణ రూ. 6,112 కోట్ల బకాయి పడిందని, వీటిని ఇప్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఈ బకాయిలు కూడా వడ్డీ సహా ఇవ్వాల్సి ఉందని, ఎంపీలు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జగన్ సూచించారు. రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ అంశాన్ని కూడా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించానని, విభజన సమయంలో మొత్తంగా రీసోర్స్ గ్యాప్ రూ. 22, 948.76 కోట్లు అయితే ఇచ్చింది, రూ. 4,117.89 కోట్లు మాత్రమేనని, దీనిపై కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
ఓవర్ బారోయింగ్ పేరుతో రుణాలు కత్తిరించడం అన్నది ఎప్పుడూ లేదన్న జగన్.,.. చంద్రబాబు హయాంలో చేసిన దానికి రుణాల్లో కత్తిరింపులకు దిగడం అన్నది సరికాదని, గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు తమ బాధ్యత లేకపోయినప్పటికీ ఎన్బీసీలో కోత విధించడం సరి కాదని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కేంద్ర ఆర్థిక శాఖ సమ్మతించకపోగా, నికర రుణ పరిమితిలో కోతను ఏకంగా మరో మూడేళ్లకు విస్తరించిందని దీనిపైనా కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు పరిమితికి మించి రుణం సేకరించిన విషయం అప్పటికే తేటతెల్లం అయిన నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక శాఖ ఆనాడే ఎందుకు స్పందించలేదో నిలదీయాలన్నారు. రాష్ట్రంలో ఇటీవల వరదల సందర్భంగా అపార నష్టం ఏర్పడిందన్న జగన్..
వరద బాధితులను ఆదుకునేందకు తక్షణ సహాయంగా రూ.వేయి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి లేఖలు కూడా రాశామని.. ఆ నిధులు రప్పించేలా చూడాలన్నారు. బీసీల అభ్యున్నతి దిశగా స్పష్టమైన కార్యాచరణకు దోహదపడేలా 2021 జన గణన సదర్భంగా బీసీ కులాల వారీగా జన గణన చేయాలని కోరామని, దీనికోసం ఒత్తిడి తీసుకు రావాలన్నారు.
ఉపాధి హామీ కింద రూ. 4976.51 కోట్ల బకాయిలు ఉన్నాయని, వీటిని విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని పలుమార్లు లేఖలు రాశామని, పెట్టుబడుల ఉపసంహరణకు బదులుగా ప్రత్యామ్నాయాలను కూడా సూచించామని ఈ విషయంపై గట్టిగగా ప్రశ్నించాలని ఎంపీలకు సూచించారు.
రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను తీసుకు వస్తున్నామన్న జగన్.. ఇంకా 13 కాలేజీలకు అనుమతి రావాల్సి ఉందని… ఈ అంశాన్ని సభలో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు. ఇళ్ల నిర్మాణం వల్ల ఏర్పడుతున్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు. దిశ బిల్లు ఆమోదం ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాలన్నారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్‌కు పార్టీ తరఫున మద్దతు పలకాలన్నారు.