టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపైన.. ఆయన కుటుంబంపైనా.. తీవ్ర విమర్శలు చేయడం.. నోటికి ఎంత వస్తే.. అంత మాట అనడం ఆనవాయితీగా పెట్టుకున్న మంత్రి కొడాలి నాని.. తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే అసెంబ్లీలో జరిగిన ఘటన తో చంద్రబాబు మనస్తాపంలో ఉన్న విషయం తెలిసింది. అయినప్పటికీ.. ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు జరిగిన అన్యాయాన్ని తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి .. మంత్రి కొడాలి నాని చంద్రబాబు కేంద్రంగా విరుచుకుపడ్డారు.
జూనియర్ ఎన్టీఆర్ తమను కంట్రోల్ చేయడమేంటని ప్రశ్నించారు. గొర్రె కసాయి వాణ్నినమ్మినట్టు ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబును నమ్మింది. చంద్రబాబు తన భార్యను తనే అల్లరి చేసుకుంటున్నారని అన్నారు. నందమూరి ఫ్యామిలీ అంటే.. సీఎం జగన్కు కూడా చాలా గౌరవం ఉందన్నారు. చంద్రబాబు తన భార్య పేరు చెప్పి.. నందమూరి ఫ్యామిలీ మద్దతును కూడగట్టుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు.. తన భార్యను తనే అల్లరి చేసుకుంటూ.. మంత్రిగా ఉన్న తనను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో కానీ, బయట కానీ.. చంద్రబాబు సతీమణి పేరు ను ఎవరూ ఎత్తలేదన్నారు. తనకు, ఎమ్మెల్యే వంశీకి కూడా ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదని.. ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేకుండానే తాము బయటకు వస్తామని.. అదేవిధంగా చంద్రబాబు బయటకు రాగలరా? సెక్యూరిటీ లేకుండా.. ఆయన పర్యటించగలరా? అని ప్రశ్నించారు. నందమూరి ఫ్యామిలీని అమాయకులుగా పేర్కొన్న మంత్రి కొడాలి.. చంద్రబాబు కేవలం రాజకీయాల కోసం.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎవరికీ ఎలాంటి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి కొడాలి స్పస్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates