‘అమెజాన్ గంజాయి’.. లింకులు ఏపీలోనే!

అమెజాన్
అమెజాన్

ఇటీవ‌ల గుజ‌రాత్‌లోని బంద్రా ఎయిర్‌పోర్టులో ల‌భించిన 1000 కోట్ల రూపాయ‌ల విలువైన మాద‌క ద్ర‌వ్యాల కేరాఫ్ ఏపీ. తెలంగాణ‌లో గంజాయి అక్ర‌మ రావాణాకు కేరాఫ్‌. మ‌హారాష్ట్ర‌లో మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణాకు కేరాఫ్ ఏపీ. ఇప్పుడు.. తాజాగా ఎక్క‌డో ఆన్‌లైన్‌లో వ్యాపారంచేసుకునే అమెజాన్‌లో జ‌రుగుతున్న గంజాయి ర‌వాణాకు కూడా కేరాఫ్ ఏపీ.. దేశంలో ఎక్క‌డ ఎలాంటి మాద‌క ద్ర‌వ్యాలు ప‌ట్టుబ‌డినా.. కేరాఫ్ ఏపీ అనే మాట వినిపిస్తోంది. ఎక్క‌డెక్క‌డి నుంచో పోలీసులు ఏపీకి వ‌స్తున్నారు. ఇక్క‌డి వారిని అరెస్టులు చేస్తున్నారు. ఇంత‌జ‌రుగుతున్నా.. కూడా ఏపీ ప్ర‌భుత్వం మాత్రం.. “మాకేమీ తెలియ‌దు.. మేం నిమిత్త‌మాత్రులం.. మీ హ‌యాంలో లేదా(టీడీపీ)” అంటూ.. ఎదురు దాడి చేస్తోంది.

తాజాగా ఏం జ‌రిగిందంటే.. విశాఖ కేంద్రంగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ‘అమెజాన్‌’ ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి స్మగ్లింగ్‌ జరుగుతున్నట్లు మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు నగరానికి వచ్చి గంజాయిని సరఫరా చేసే శ్రీనివాస్‌ అనే వ్యక్తితో పాటు అమెజాన్ పికప్ బాయ్స్ కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారిచ్చిన సమాచారం మేరకు విశాఖలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ నెల 13న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఓ దాబాలో గంజాయి పట్టుబడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా విశాఖ నుంచి అమెజాన్ యాప్‌ ద్వారా గంజాయి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. విశాఖ నుంచి వచ్చిన గంజాయిని పికప్‌ చేసుకునే ముగ్గురిని మధ్యప్రదేశ్‌లోని బెండీ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఆ కేసులో భాగంగానే విచారణ నిమిత్తం మధ్యప్రదేశ్ పోలీసులు బుధ‌వారం విశాఖ చేరుకున్నారు. వీరితో పాటు ఎస్ఈబీ అధికారులు కూడా రంగంలోకి దిగారు.

కరివేపాకు పొడి, హెర్బల్‌ పౌడర్ల పేరుతో అమెజాన్ పికప్ బాయ్స్ సహకారంతో గంజాయిని విశాఖ నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు చేసి అమెజాన్ స్టిక్కర్లు, ప్యాకింగ్ మెటీరియల్‌తో పాటు కొంత గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడిన నలుగురు నిందితులు విశాఖలోని కంచరపాలెం ఇండస్ట్రీయల్ ఎస్టే్‌ట్‌లోని స్టోర్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. మ‌రి దీనిపై జ‌గ‌న్ స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.