వైసీపీ సీనియర్ నాయకుడు.. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి గురించి వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. షార్ప్ షూటర్‌గా ఆయన అనేక విజయాలు సాధించారు. గత 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్.. సత్తాతో పార్టీ విజయం సాధించింది. ఎక్కడికక్కడ విజయం దక్కించుకుంది. ఆ ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారు. దీంతో పార్టీ తరఫున ఎవరు నిలబడ్డా విజయం దక్కించుకున్నారు. జగన్‌పై సింపతీ కావొచ్చు.. ఏదైనా కావొచ్చు.. పార్టీ విజయం దక్కించుకుని రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. అదేసమయంల ఎంపీలను కూడా దక్కించుకున్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా.. జగన్‌కే దక్కింది. ఈ విషయంలో రెండో మాట కూడా లేదు.
అయితే.. ఆ తర్వాత రాష్ట్రంలో వచ్చిన ఉప ఎన్నికలు కావొచ్చు.. పంచాయితీ ఎన్నికలు కావొచ్చు.. ముని సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు కావొచ్చు. అన్నింటిలోనూ.. జగన్ దూరంగానే ఉన్నారు.. ఆయన తాడేపల్లి నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయలేదు. అంతా కూడా తాడేపల్లి నుంచి నడిపించారు. అయితే.. అదేసమయంలో వయసు ను కూడా లెక్కచేయకుండా.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. నిజానికి మునిసిపల్ ఎన్నికల్లో బాధ్యతను మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తీసుకున్నా.. ఆయన పాత్ర కేవలం ఉత్తరాంధ్ర, విజయవాడ వరకే పరిమితం చేసుకున్నారు. అనారోగ్య కారణాలు చూపించారు.
దీంతో మొత్తం బాధ్యతను పెద్దిరెడ్డి ఒక్కరే భుజనా వేసుకున్నారు. దీంతో వైసీపీ వ్యూహాత్మకంగా విజయం దక్కించుకుంది. ఇంత వరకు బాగానే ఉంది. అంతేకాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ పెద్దిరెడ్డి వైసీపీ జెండా ఎగరేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆయన వైసీపీని వ్యూహాత్మకంగా ఇక్కడ పుంజుకునేలా చేశారు. ఇంత వరకుబాగానే ఉంది. జగన్ కూడా ఫిదా అయ్యారు. అయితే.. ఇప్పుడు చర్చంతా కూడా.. పెద్దిరెడ్డికి న్యాయం జరుగుతుందా? అనేదే! ఎందుకంటే..త్వరలోనే మంత్రి వర్గాన్ని మార్చుతారని ప్రచారం ఉంది.. గతంలో జగన్ హామీ ఇచ్చిన మేరకు .. మొత్తం 90 శాతం మంది మంత్రులను మార్చాలి.
ఈ క్రమంలో పెద్దిరెడ్డి వంటి పార్టీకి అన్ని విధాలా సాయం చేసిన నాయకుడిని కూడా మార్చేస్తారా? అనే చర్చ సాగుతోంది. అయితే.. వైసీపీలో సీనియర్లు రెండు వాదనలు వినిపిస్తున్నారు. ఒకటి ఆయనను మంత్రిగానే కొనసాగిస్తారని అనేవారు ఉన్నారు. లేదు. ఒకవేళ మంత్రిగా ఆయనను పక్కన పెటినా.. సీమలో వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీని గెలిపించే బృహత్తర బాధ్యతను అప్పగిస్తారని.. ముఖ్యంగా చంద్రబాబు కనుక కుప్పం నుంచి పోటీ చేస్తే.. ఆయనను ఓడించే బాధ్యత పెద్దిరెడ్డిపైనే ఉంటుందని అంటున్నారు. మొత్తంగా ఇప్పుడు పెద్దిరెడ్డి కేంద్రంగా వైసీపీలో చర్చ జరుగుతుండడం గమనార్హం. చివరకుఏం జరుగుతుందో చూడాలి.