రాష్ట్రమంతా పాదయాత్రలట

అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచాలనే డిమాండ్ తో తొందరలోనే రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలని అమరావతి జేఏసీ డిసైడ్ చేసింది. ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కంటిన్యూ చేయాలని డిమాండ్ తో ఆందోళనకారులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి జేఏసీ నేతలు కావలిలో మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల బిల్లులో లోపాలున్నాయన్న కారణంగానే హఠాత్తుగా ఉపసంహరించుకున్నట్లుగా మండిపడ్డారు.

మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహిరంచుకుంటున్నట్లు తెలియగానే సోమవారం ఉదయం పాదయాత్రలో ఉన్న జేఏసీ నేతలు, ఆందోళనకారులు స్వీట్లు పంచుకున్నారు. అయితే మధ్యాహ్నానికల్లా ఇపుడు ఉపసంహరించుకున్న బిల్లునే మరింత సమగ్రంగా తిరిగి తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడాన్ని ఆందోళనకారులు తట్టుకోలేకపోయారు. తమ ఉత్సాహం కొద్ది గంటల్లోనే ఆవిరైపోవటాన్ని జీర్ణించుకోలేకపోయారు.

అందుకనే అప్పటికప్పుడు సమావేశం పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని డిసైడ్ చేశారు. తమ పాదయాత్రకు వస్తున్న జనాల మద్దతు చూసే మూడు రాజధానుల ఏర్పాటు నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గిందని ముందుగా అనుకున్నారు. అయితే సాంకేతిక కారణాలతో మాత్రమే ప్రభుత్వం వెనక్కు తగ్గిందని తెలియగానే ఆందోళనకారులు తట్టుకోలేకపోయారు. తమ బిల్లులో తప్పులున్నాయని ప్రభుత్వమే ఒప్పుకుందని జేఏసీ నేతలు చెప్పారు.

మొదటిసారి ప్రవేశపెట్టిన బిల్లుకే జగన్ ప్రభుత్వం రెండేళ్లు తీసుకుంటే మళ్ళీ కొత్త బిల్లును తీసుకొస్తామని ప్రకటించటంలో అర్ధమేలేదంటు మండిపోయారు. కొత్తగా తీసుకొచ్చే బిల్లుకు ప్రభుత్వం ఇంకెంత కాలం తీసుకుంటుందని సూటిగా ప్రశ్నించారు. అమరావతి పాదయాత్రకు ప్రజల్లో భారీ స్పందన వస్తుండటంతో రాష్ట్రమంతటా పాదయాత్రలు చేయడానికి జేఏసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.