బండిని ఆపేందుకు కేసీఆర్ అడుగులు

తెలంగాణ‌లో వ‌రుస‌గా రెండోసారి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్‌కు ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షాల నుంచి స‌వాలు ఎదుర‌వుతుందంటే అందుకు బండి సంజ‌య్ ప్ర‌ధాన కార‌ణం. ఏడేళ్లుగా తిరుగులేని కేసీఆర్‌కు సంజ‌య్ కొర‌క‌రాని కొయ్య‌లా మారారు. గ‌తేడాది బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఈ క‌రీంన‌గ‌ర్ ఎంపీ.. దూకుడు పెంచారు.

రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు గట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక‌లో విజ‌యం, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాల‌తో మ‌రింత జోరు పెంచారు. ఇప్పుడిక హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ నుంచి పోటీ చేసిన ఈట‌ల రాజేంద‌ర్ గెల‌వ‌డంతో బండి ప‌ట్టాప‌గ్గాలు లేకుండా ప‌రుగులు పెడుతోంది.

కేసీఆర్ ఒక్క మాటంటే చాలు.. బండి సంజ‌య్ వెంట‌నే ప‌ది మాట‌ల‌తో విరుచుకుప‌డ‌డం కేంద్రంపై విమ‌ర్శ‌ల‌ను స‌మ‌ర్థంగా తిప్పుకొట్ట‌డం అధికార పార్టీకి మింగుడుప‌డ‌డం లేదు. అందుకే ముందు సంజ‌య్‌కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం. లోక్‌స‌భ ఎంపీగా సంజ‌య్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కరీంన‌గ‌ర్‌లో ఆయ‌న్ని అడ్డుకునేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే అక్క‌డ టీఆర్ఎస్‌ను బ‌లోపేతం చేసే దిశ‌గా కీల‌క ప‌ద‌వుల‌ను ఆ జిల్లా నేత‌ల‌కు క‌ట్ట‌బెడుతున్నార‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ నుంచి ముగ్గురు మంత్రులు, ఓ ప్ర‌ణాళిక వైస్ ఛైర్మ‌న్ ఉన్నారు. ఇటీవ‌ల ఎస్సీ కార్పోరేష‌న్‌, బీసీ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వుల‌ను ఆ జిల్లా నాయ‌కుల‌కే క‌ట్ట‌బెట్టారు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు ప‌ద‌వులిచ్చారు. జ‌న‌వ‌రిలో ఖాళీ అయ్యే మ‌రో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా క‌రీంన‌గ‌ర్‌కే ద‌క్కుతాయి.

ఇలా క‌రీంన‌గ‌ర్ నాయ‌కుల ప‌ద‌వుల పంట పండుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సంజ‌య్ వ్యూహాల‌ను తిప్పి కొట్టేందుకు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో కేసీఆర్ ఇలాంటి వ్యూహాలు ర‌చిస్తున్నార‌ని అందుకే అక్క‌డి నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వులు ఇస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి ఆ నాయ‌కులు బండి సంజ‌య్‌ను ఏ మేర‌కు క‌ట్ట‌డి చేస్తారో చూడాలి.