ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై వ్యతిరేకత నిజమేనా ? అటు బీజేపీ నాయకులు.. ఇటు టీడీపీ నాయకులు దీనిపైనే ఆశలు పెట్టుకున్నారా? అంటే.. అవుననే అంటున్నారు పరిశీలకులు. వైసీపీ సర్కారు ఏర్పడి రాష్ట్రంలో రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. అయితే.. ఈ రెండున్నరేళ్ల కాలంలో జగన్ ఒక్కసారి కూడా ప్రజల మధ్యరాలేదు. అప్పుడప్పుడు.. కార్యక్రమాలు నిర్వహించినా.. ఆశించిన స్థాయిలో ఆయన ఎన్నికల సమయంలో వచ్చినట్టు ప్రజల మధ్యకు రాలేదు. అదే చంద్రబాబును తీసుకుంటే.. రెండున్నరేళ్ల ఆయన పాలనలో అనేక సందర్భాల్లో ప్రజల మధ్యకు వచ్చారు.
కానీ, జగన్ మాత్రం ఇప్పటి వరకు ప్రజల మద్యకు రాలేదు. కేవలం తాను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న నవరత్నాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి తాను ప్రజల మధ్యకు రాకపోయినా.. ఏమవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో జగన్పై వ్యతిరేకత పెరిగిందనేది బీజేపీ, టీడీపీ నేతల భావన. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని. రోడ్లునాశనమైనా పట్టించుకోవడం లేదని.. పెట్టుబడులు కూడా రావడం లేదని.. ఉపాధి కూడా లేక ప్రజలు అల్లాడుతున్నారని.. జగన్ తీసుకున్న నిర్ణయంతో ఇసుక లభించక ఇబ్బందులు పడుతున్నారని..పనులు లేక కార్మికులు పూట గడవడమే ఇబ్బందిగా ఫీలవుతున్నారని.. ఈ పార్టీలు అంచనా వేస్తున్నాయి.
అయితే.. వైసీపీ వాదన వేరేగా ఉంది. కరోనా సమయంలోనూ తాము ప్రజలను ఆదుకున్నామని.. అన్ని సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని.. ముఖ్యంగా ఇప్పటి వరకు మహిళలకుఏ పార్టీ ఇవ్వని ప్రాధాన్యం ఇస్తున్నామని.. కనుక తమపై వ్యతిరేకత లేదని.. అంటున్నారు నాయకులు. ఈ నేపథ్యంలో జగన్పై అసలు వ్యతిరేకత లేదని చెబుతున్నారు. అంతేకాదు.. వ్యతిరేకత అనేది పార్టీల ప్రచారం మాత్రమేనని అంటున్నారు. అయితే.. వాస్తవం చూస్తే.. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు కొన్ని వర్గాలకు మాత్రమే న్యాయం చేస్తున్నాయి. మరికొన్ని వర్గాలకు చేయడం లేదు.
దీంతో సహజంగానే ప్రభుత్వ పథకాలు దక్కనివారు ఆందోళనతోనే ఉన్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయంపై మధ్య తరగతి వర్గంతోపాటు.. రియల్ ఎస్టేట్ దారులు, పెట్టుబడి వర్గాలు ఆందోళనతోనే ఉన్నాయి. దీనిని బట్టి.. వ్యతిరేకత అయితే.. మొదలైందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించారా ? గుర్తించి కూడా అధినేతకు చెప్పేందుకు భయపడుతున్నారా? అనేది సందేహంగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates