రాబోయే రెండున్నరేళ్లు అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ఎంఎల్ఏలు బహిష్కరించబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. అసెంబ్లీని తాను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించినా మొత్తం టీడీపీ సభ్యులంతా అదే దారిలో నడవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమ అధినేత చంద్రబాబే సభను బహిష్కరించిన తర్వాత తాము మాత్రం సభలో ఉండి చేసేదేమీ ఉండదని మిగిలిన ఎంఎల్ఏలు కూడా ఆలోచిస్తున్నారట.
అధికార సభ్యుల వైఖరిలో ఎలాంటి మార్పుండదు కాబట్టి తాము సభకు హాజరైనా ఎలాంటి ఉపయోగం ఉండదని తమ్ముళ్ళల్లో చర్చ జరుగుతోందని సమాచారం. సభలో జరిగిన తాజా రచ్చకు కారణం ఏదైనా టీడీపీ మాత్రం రచ్చకు పూర్తి కారణం వైసీపీ అనే అరోపిస్తోంది.
సరే రచ్చ ఎలా మొదలైందో చివరకు ఎలా ముగిసిందనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇపుడు బహిష్కరణ అంశమే హాట్ టాపిక్ అయిపోయింది. గతంలో ఎన్టీయార్ కూడా 1993లో అసెంబ్లీని బహిష్కరించారు. అప్పట్లో తన ప్రధాన మద్దతుదారుడు శివారెడ్డి హత్యపై న్యాయవిచారణకు ఎన్టీయార్ డిమాండ్ చేసినా అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి కాదన్నారు. దాంతో సభలో జరిగిన గొడవకు సభ్యులందరినీ సస్పెండ్ చేశారు. దాంతో కోట్ల ప్రభుత్వంపై ఆగ్రహించిన ఎన్టీయార్ అసెంబ్లీని బహిష్కరించారు. అయితే సభ్యులు మాత్రం హాజరయ్యారు.
ఆ తర్వాత 2015లో జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీని బహిష్కరించారు. తనను టీడీపీ సభ్యులు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవటం, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం, తమ సభ్యులను నిబంధనలకు వ్యతిరేకంగా సస్పెండ్ చేయటం లాంటి ఘటనల తర్వాత అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. జగన్ తో పాటు మిగిలిన ఎంఎల్ఏలు కూడా తర్వాత రెండున్నరేళ్లు సభలోకి అడుగుపెట్టలేదు. ఇపుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంలో కాస్త అయోమయం ఉంది.
అసెంబ్లీని తాను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారే కానీ మిగిలిన సభ్యుల విషయాన్ని ప్రస్తావించలేదు. అయితే చంద్రబాబు ప్రకటన తర్వాత ఎంఎల్ఏల్లో ఇదే విషయమై చర్చలు జరుగుతోంది. చంద్రబాబు సభలో లేనపుడు తాము హాజరై మాత్రం చేసేదేముంటుందని కొందరు ఎంఎల్ఏలు అన్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై ఈరోజో రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెజారిటి సభ్యుల ఆలోచనైతే హోలు మొత్తంమీద సభను బహిష్కరించాలనే ఉందని తెలుస్తోంది.